భూసేకరణ సవరణ బిల్లుపై ఇప్పటికిప్పుడే ముందుకెళ్లే సాహసం మోదీ సర్కారు చేస్తుందా? దేశం మొత్తం చూస్తుండగా (టీవీల్లో)... ఓ రైతు ఢిల్లీలో ఉరివేసుకొని చనిపోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. రైతాంగంలో ఆవేశం, ఆవేదన పెల్లుబుకుతున్న తరుణంలో... విపక్షాలు ఈ బిల్లును తేవొద్దని పార్లమెంటు వేదికగా డిమాండ్ చేసిన నేపథ్యంలో మోదీ సర్కారు భూసేకరణ సవరణ బిలుపై తక్షణం ముందుకెళ్లకపోవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. 2013లో యూపీఏ సర్కారు తెచ్చిన భూసేకరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని సవరణలు తెచ్చి కోరలు పీకేసిన విషయం విదితమే.
దీనిపై జారీచేసిన ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టింది. లోక్‌సభలో బలమున్న నేపథ్యంలో మార్చి 10న ఆమోదం పొందింది. రాజ్యసభలో ఎన్డీఏకు తగిన బలం లేకపోవడం, విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం, మిత్రపక్షాలు సైతం అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో రాజ్యసభలో పెట్టలేదు. ఈ లోపు ఆర్డినెన్స్ గడువు ముగిసిపోతున్న సమయంలో ఏప్రిల్ 3న మళ్లీ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. నిజానికి ఉభయసభల సంయుక్త సమావేశం ద్వారా ఈ బిల్లును గట్టెక్కించాలని కేంద్రం భావిం చింది. అయితే సంయుక్త సమావేశం పెట్టాలంటే రెండు సభల్లో ఏదో ఒకటి బిల్లును తిరస్కరించాలి.
రాజ్యసభ సమావేశాలు మే 13 వరకు జరగనున్నాయి. బిల్లు రైతుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని, బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఇప్పటికే గట్టిగా జనంలోకి తీసుకెళ్లాయి. ఈ ముద్రను చెరిపేసుకోవడానికి తమ శ్రేణుల ద్వారా విసృ్తతంగా జనంలోకి వెళ్లాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో రైతు ఆత్మహత్య మోదీ సర్కారును ఇరకాటంలో పడేసింది. జనాగ్రహం చల్లారకముందే బిల్లు జోలికెళితే... పార్టీకి మరింత చెడ్డపేరు వచ్చే అవకాశముంటుంది. అందువల్ల ఇప్పుడప్పుడే ఈ బిల్లును తెచ్చే ప్రయత్నం మోదీ సర్కారు చేయకపోవచ్చని విశ్లేషకుల అంచనా. - నేషనల్ డెస్క్