
ప్రపంచంలోనే అతి పే..ద్ద విమానం గాలిలో..!
లండన్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎట్టకేలకు బుధవారం గాలిలోకి ఎగిరింది. నాలుగురోజుల కిందటే ఈ విమానాన్ని తొలిసారి నడిపేందుకు ప్రయత్నించినా.. సాంకేతిక కారణాల వల్ల సాధ్యపడలేదు.
కొంత విమానం, కొంత ఎయిర్‌షిప్ అయిన ఎయిర్‌ల్యాండర్-10 విమానం బుధవారం మధ్య ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. ప్రపంచంలోని అతిపెద్ద విమానమైన ఎయిర్ ల్యాండర్-10 తొలిసారి ఎగురుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి.. దానిని వీక్షించారు.
85 ఏళ్ల కిందట 1930 అక్టోబర్‌లో ఇదే ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్‌షిప్ ఆర్101 ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రిటన్‌లో ఎయిర్ షిప్‌లను రూపొందించడం ఆపేశారు. తాజాగా 302 అడుగుల పొడవున్న ఎయిర్‌ల్యాండర్-10ను అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్(హెచ్‌ఏవీ) రూపొందించింది.