
సాక్షి, బెంగళూరు: అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎమిరేట్స్ ఎయిర్‌బస్–ఏ380 బెంగళూరుకు నేరుగా సేవలను అందించనుంది. అక్టోబర్ 30న దుబాయ్ నుంచి వచ్చి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది.
2014 నుంచి ముంబైకి సర్వీసులను అందిస్తోంది. 72.75 మీటర్ల పొడవు, 24.45 మీటర్ల ఎత్తు కలిగిన ఈ విమానంలో గరిష్టంగా 853 మంది ప్రయాణించవచ్చు. ఒకసారి 3 వేల సూట్‌కేసులను తరలించే సామర్థ్యం ఈ విమానానికి ఉంది.
అక్టోబర్ 30 నుంచి ప్రతి రోజూ బెంగళూరు నుంచి దుబాయ్‌కి విమానం రాకపోకలు సాగిస్తుందని ఎమిరేట్స్ సంస్థ వెల్లడించింది. ఈ విమానంలో మూడు తరగతుల (ఎకానమీ, బిజినెస్, ఫస్ట్‌క్లాస్) ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. బోయింగ్–777తో పోలిస్తే 45 శాతం అధిక మంది ప్రయాణించవచ్చు. ప్రపంచంలోని 30 విమానాశ్రయాలకు ఎయిర్‌బస్–ఏ380 తన సేవలను అందిస్తుంది.