
ప్రపంచ అతిపెద్ద విమానం క్రాష్‌ల్యాండ్!
అది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. 320 అడుగుల పొడవు, రూ. 222 కోట్ల (25మిలియన్ పౌండ్ల) ఖర్చుతో రూపొందిన ఎయిర్‌ల్యాండర్-10 గాలిలోకి ఎగిరిన ఏడురోజులకే క్రాష్ ల్యాండ్ అయింది. 'ఫ్లయింగ్ బమ్' అని ముద్దుగా పిలుచుకునే ఈ విమానం బుధవారం ల్యాండ్ అయ్యే సమయంలో సమీపంలో ఉన్న ఓ టెలిగ్రాఫ్ స్తంభాన్ని ఢీకొట్టింది. విమానం సవ్యంగా ల్యాండ్ కాకపోవడంతో కాక్‌పిట్ ధ్వంసమైంది. బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, విమానం చాలా నెమ్మదిగా దిగుతూ ఉండటం వల్ల క్రాష్‌ల్యాండ్ అయినా పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. అయితే, క్రాష్‌ల్యాండ్ అయ్యే సమయంలో భూమి బద్దలైనట్టు అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కొంత విమానం, కొంత ఎయిర్‌షిప్ అయిన ఎయిర్‌ల్యాండర్-10 విమానం గత బుధవారం మధ్య ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరిన సంగతి తెలిసిందే. పదిటన్నుల బరువు మోయగల ఈ అతిపెద్ద విమానాన్ని బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్(హెచ్‌ఏవీ) రూపొందించింది. ఈ విమానం బ్రిటన్‌లోనే అతిగొప్ప ఆవిష్కరణగా రూపకర్తలు గొప్పలు చెప్పుకొన్నారు.