ఎడ్ల పందేల కోసం పట్టుబడదాం
తమిళనాడులో జల్లికట్టు కోసం జరిగిన పోరాటం మరిన్ని రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చింది. కర్ణాటకలో కంబళ పోటీని చట్టబద్ధం చేసేందుకు అక్కడ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుకాగా, తాజాగా మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందేలకు కూడా అనుమతి పొందేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ముంబైలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకటించారు.
దాంతోపాటు, త్వరలోనే జరగనున్న బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఇక ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని, అసలైన పోరు ఇప్పుడే మొదలు కాబోతోందని కూడా ఠాక్రే చెప్పారు. మహారాష్ట్రలో ఇన్నాళ్లూ బీజేపీ - శివసేనల మధ్య పొత్తు ఉండగా.. ఇప్పుడు ఒంటరి పోరాటానికి శివసేన ముందుకెళ్లడం విశేషం.