కలిసుందామని రమ్మంటే.. రూ 30 లక్షలు కాజేశాడు
అహ్మదాబాద్: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి 30 లక్షల రూపాయలు కాజేశాడని గుజరాత్కు చెందిన ఓ మహిళా టీచర్ (42) పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఆశీష్ మోదీ ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశాడని బాధితురాలు నవరంగ్పురకు చెందిన ఆర్తి సాంధారియా ఆరోపించింది.
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆర్తీ ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆరేళ్లక్రితం కార్ డీలర్షిప్ వద్ద ఆమెకు సరేంద్రనగర్కు చెందిన ఆశీష్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ తరచూ కలిసేవారు. 12 ఏళ్ల క్రితం భార్య నుంచి విడిపోయినట్టు ఆశీష్ చెప్పగా, తాను కూడా భర్తకు దూరమైనట్టు ఆర్తీ చెప్పింది. సహజీవనం చేసేందుకు ఆర్తీ ఆహ్వానించగా, ఆశీష్ అంగీకరించాడు.
వీరి బంధం కొన్నేళ్లు సవ్యంగా సాగింది. కాగా గత ఏప‍్రిల్లో ఆశీష్ తనకు తెలియకుండా డబ్బులు డ్రా చేసినట్టు ఆర్తీ గుర్తించింది. ఏటీఎమ్ కార్డుల నుంచి డబ్బు కాజేయడంతో పాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిక్ బ్యాంక్ ఎకౌంట్ల నుంచి 10 లక్షలు డ్రా చేసినట్టు తెలుసుకుంది. ఇక క్రెడిట్ కార్డు ఉపయోగించి మరో 8 లక్షలు వాడుకున్నట్టు గుర్తించింది. ఈ విషయంపై ఆశీష్ను నిలదీయగా, డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆర్తీకి దూరంకావడంతో పాటు ఫోన్ చేసినా మాట్లాడేవాడు కాదు. నాలుగేళ్ల క్రితం వ్యాపారనిమిత్తం 9 లక్షల రూపాయలు, ఏడాది క్రితం మరో నాలుగు లక్షల రూపాయలు ఆశీష్‌కు అప్పుగా ఇచ్చినట్టు ఆర్తీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.