సహజీవనంలో భాగస్వామిపై 498 కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో మహిళతో సహజీవనం చేసే వ్యక్తిని భర్తగా పరిగణించలేమని పేర్కొంది. మహిళ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తిని భర్తగా భావించి సెక్షన్ 498 ప్రకారం క్రూరత్వం కింద విచారించలేమని స్పష్టం చేసింది.
చట్టబద్ధంగా వివాహం చేసుకోని మహిళ తనతో రిలేషన్‌లో ఉంటున్న వ్యక్తి క్రూరత్వానికి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 498A కింద కేసు పెట్టలేమని హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన మహిళతో రిలేషన్‌లో ఉన్న వ్యక్తిపై విచారణను రద్దు చేస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది.
కాగా 2023 మార్చి నుంచి 2023 ఆగస్టు వరకు తాము లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న సమయంలో తన భాగస్వామి మానసికంగా, శారీరంగా వేధించాడని మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు భర్త అనే పదానికి నిర్వచనాన్ని చెబుతూనే, లివ్ ఇన్ పార్ట్‌నర్‌ని భర్తగా చూడలేమని చెప్పింది.
సెక్షన్ 498A కింద నేరాన్ని నమోదు చేయాలంటే. భర్త లేదా భర్త బంధువులు క్రూరత్వానికి పాల్పడి ఉండాలని కోర్టు సూచించింది. మహిళతో చట్టబద్దంగా వివాహం జరిగిన వ్యక్తిని భర్తగా పరిగణిస్తారని తెలిపింది. చట్టబద్ధమైన వివాహం లేకుండా స్త్రీ భాగస్వామిని సెక్షన్ 498 ఏ క్రూరత్వం కింద విచారించలేమని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment