అద్వానీకి మోడీ జన్మదిన శుభాకాంక్షలు
భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం మోడీ స్వయంగా ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. అద్వానీ శుక్రవారం 86 వ వసంతంలోకి అడుగు పెట్టారు. కాగా రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఎంపిక చేయాలని ఈ ఏడాది మొదట్లో బీజేపీ నిర్ణయించింది.
అయితే పార్టీ నిర్ణయాన్ని అద్వానీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో అద్వానీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. అలాగే సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన ప్రధాన అభ్యర్థిగా నరేంద్రమోడీ ఎంపిక సమావేశానికి కూడా అద్వానీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుని అద్వానీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేసింది. అయితే ఇటీవల మోడీ నిర్వహించిన ర్యాలీకి అద్వానీ హాజరయ్యారు. ఇటీవల అద్వానీ, నరేంద్రమోడీలు ఇద్దరు తరచుగా వివిధ ర్యాలీలు, పలు వేదికలపై కలుసుకుంటున్నారు.