బెజవాడలో లాకప్ డెత్? | Lock up death in bejawada ? | Sakshi
Sakshi News home page

బెజవాడలో లాకప్ డెత్?

Published Mon, Oct 19 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

బెజవాడలో లాకప్ డెత్?

బెజవాడలో లాకప్ డెత్?

- భార్య హత్యకేసులో భర్తను విచారణకు తీసుకొచ్చిన పోలీసులు
- అపస్మారకస్థితిలో రైల్వేస్టేషన్ వద్ద కనిపించిన వైనం
- హడావుడిగా పోస్టుమార్టం, అంత్యక్రియలు
- అటువంటిదేమీ లేదంటున్న పోలీసులు
 
విజయవాడ సిటీ: భార్య హత్య కేసులో నిందితుడి  నుంచి నిజాలు రాబట్టడానికి పోలీసులు ఇచ్చిన ట్రీట్‌మెంట్ వికటించింది. నిందితుడు ప్రాణాపాయ స్థితికి చేరటంతో పోలీసులు ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని భావించారో ఏమో.. అతడిని రైల్వేస్టేషన్ సమీపంలో పడేశారు. అతడిని గుర్తించిన స్థానికులు 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసినా అతడి ప్రాణాలు నిలవలేదు. సంచలనం కలిగించిన ఈ సంఘటన విజయవాడలో శనివారం అర్ధరాత్రి తరువాత జరిగింది.
 
 విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మధురానగర్ పసుపుతోట ప్రాంతానికి చెందిన కోలవెన్ను విజయకుమార్ ఐదేళ్ల కిందట భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. తరువాత రాజమండ్రి వెళ్లి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే బ్యూటీ పార్లర్ నిర్వహించే రమణకుమారితో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. ఆమె కుటుంబ సభ్యుల ఒత్తిడితో రమణకుమారిని పెళ్లి చేసుకోగా, ఈ విషయం తెలిసి మొదటి భార్య పద్మావతి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఈనెల 3న రమణకుమారిని తీసుకుని విజయవాడ వచ్చిన విజయకుమార్ తరువాత ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లి హత్యచేశాడు. రమణకుమారి కనిపించడం లేదని ఇటీవల ఆమె కుటుంబసభ్యులు విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
 
 దర్యాప్తులో భాగంగా ఆమె హత్య వెలుగు చూడటంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం పోలీసులు విజయకుమార్‌ను తీసుకొచ్చారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వేస్టేషన్ పార్శిల్ కార్యాలయం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న విజయకుమార్‌ను గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
 
 విషయం తెలిసిన సత్యనారాయణపురం ఎస్‌ఐ నరేష్ ఆదివారం ఉదయం ఏడుగంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి వెళ్లి హడావుడిగా పోస్టుమార్టం చేయించారు. సాధారణ రోజుల్లో ఉదయం 10 గంటలలోపు రాని వైద్యులు పోలీసుల కోరిక మేరకు ఏడుగంటలకే వచ్చి పోస్టుమార్టం చేశారు. తరువాత మృతదేహాన్ని పటమటలోని మృతుడి సోదరుడు భద్రాచలానికి అప్పగించగా 10 గంటల కల్లా దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు కప్పిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. శాంతిభద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్‌ను దీనిపై వివరణ కోరగా.. తొలుత అలాంటి విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఆ తర్వాత ఓ వ్యక్తిది అనుమానాస్పద మృతి అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు విషయం మాట్లాడేందుకు నిరాకరించగా, భద్రాచలం ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు. పోలీసులు అసలేం జరగలేదని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement