ఎడమ కుడైతే ప్రాణాంతకమే..!
- రైల్వేలో సిగ్నళ్ల తారుమారుతో ప్రమాద ఘంటికలు
- ముందే గుర్తించే సూచిక బోర్డులు కనిపించవు..
- గుర్తించకుండా ముందుకెళ్తున్న లోకో పైలట్లు
- ట్రాఫిక్ రద్దీతో ప్రయాణ నిడివి పెరిగి తగ్గుతున్న విశ్రాంతి సమయం
- దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లోకో పైలట్ల ఫిర్యాదు
- సిగ్నళ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు..
సాక్షి, హైదరాబాద్: రెడ్ సిగ్నల్ పడ్డా సిగ్నళ్లను చూసుకోకుండా లోకోపైలట్లు రైలును ముందుకు పోనిస్తే.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపం కావాల్సిందే.. ఇటీవల వరంగల్‌లో రెడ్ సిగ్నల్ పడినా రైలు ముందుకు వెళ్లిన విషయం ఇప్పుడు రైల్వే శాఖలో కలకలం సృష్టిస్తోంది. అయితే దీని వెనుక కారణాలు అన్వేషించేందుకు రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ నేరుగా లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా లోకోపైలట్లు వారి ఇబ్బందులు, సమస్యలను జీఎంతో చెప్పుకొన్నారు. లోకోపైలట్లు చెప్పిన అంశాలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 40 మంది లోకోపైలట్లతో భేటీ అయ్యారు.
లోకోపైలట్లు చెప్పిన అంశాలు..
సాధారణంగా పట్టాలకు ఎడమవైపు సిగ్నల్ స్తంభాలు ఉంటా యి. సిగ్నళ్లను గమనిస్తూ లోకోపైలట్లు రైళ్లను నడుపుతారు. అయితే కొన్నిచోట్ల ఎడమవైపు స్థలం లేదనో, మరే ఇతర సమస్యలతోనో వాటిని కుడివైపు ఏర్పాటు చేశారు. కుడివైపు సిగ్నళ్లుండే విషయం ముందుగానే పైలట్లు గమనించేలా సూచికలను ఏర్పాటు చేయాలి. ఆ సూచికలు కనిపించట్లేదని లోకోపైలట్లు చెప్పారు. అవి సులభంగా కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. సూచికలు కనిపించకపోవడంతో కుడివైపు సిగ్నళ్లు ఉన్న విషయం ఆలస్యంగా గుర్తిస్తున్నట్లు కొందరు జూనియర్ లోకోపైలట్లు పేర్కొన్నారు.
ట్రాఫిక్‌తో విశ్రాంతి కొరవ..
రెండో లైన్ అందుబాటులో లేని చోట్ల రైళ్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండి గమ్యం చేరటంలో జాప్యం జరుగుతోంది. దీంతో డ్యూటీకి డ్యూటీకి మధ్య విరామం తగ్గి విశ్రాంతి సమయం సరిపోవట్లేదని లోకోపైలట్లు పేర్కొన్నారు. లోకోపైలట్లు కొరత వల్ల కూడా కొన్ని చోట్ల విశ్రాంతి లేకుండానే వెంటనే డ్యూటీలకు రావాల్సిన పరిస్థితులు అప్పుడప్పుడు ఉంటున్నాయని కొందరు వాపోయారు. వీటితోపాటు సెలవులు, ఆరోగ్య సమస్యలు, క్యాబిన్‌లో వేడిమి, చలిలాంటి వాతావరణాలను తట్టుకునే ఏర్పాటు లేకపోవటం చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. సిగ్నలింగ్ విభాగంతో సమన్వయ లోపం వంటి అంశాలను జీఎం దృష్టికి తెచ్చారు. దీంతో తన పరిధిలో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించేందుకు ఆయా విభాగాధిపతులతో జీఎం భేటీ అయి ఆదేశాలు జారీ చేశారు. పెద్ద సమస్యల పరిష్కారంపై రైల్వేబోర్డును ఆశ్రయించాలని నిర్ణయించారు.