రైలింజన్లలో వాష్‌రూంలు లేక మహిళా లోకోపైలట్ల నరకయాతన
దీంతో కొందరు నీళ్లు తాగకుండా డ్యూటీకి వస్తున్న వైనం..
మరికొందరైతే అడల్ట్ డైపర్లు వాడుతున్న దుస్థితి..
ఇలా చేస్తే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు వస్తాయంటున్న వైద్యులు
ఈ ఇబ్బందులు పడలేక స్టేషన్ డ్యూటీలు కోరుతున్న లోకోపైలట్లు
వాష్‌రూంల ఏర్పాటుకు 2016లోనే జాతీయ మానవ
హక్కుల కమిషన్ ఆదేశం.. అమలు కాని తీరు..
కమిటీ వేశారు.. ఫలితం లేదు: ఎన్‌ఎఫ్‌ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య
రైలింజన్లలో వాష్‌రూంలు లేక మహిళా లోకోపైలట్ల యాతన
ఒక్కసారి ఊహించుకోండి.. మీరు బిజీ సెంటర్లో ఉన్నారు. చాలా అర్జెంటు.. ఎక్కడా వెళ్లే పరిస్థితి లేదు. మీకెలా అనిపిస్తుంది? నరకయాతన కదూ.. ఒక్క రోజుకే మన పరిస్థితి ఇలా ఉంటే.. దేశంలో రైళ్లను నడిపే మహిళా లోకోపైలట్లు రోజూ ఈ నరకయాతనను అనుభవిస్తున్నారు. అదీ ఎన్నో ఏళ్లుగా..
దేశవ్యాప్తంగా..
లోకోపైలట్‌లు 86,000
దక్షిణమధ్య రైల్వేలో 12,000
మహిళలు 3,000
మహిళలు 500
భారతీయ రైల్వే.. గతంతో పోలిస్తే ఎంతో
మారింది. మన రైళ్లలోనూ ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అదే రైళ్లను నడిపే లోకోపైలట్‌లకు కనీస సదుపాయమైన వాష్‌రూం మాత్రం నేటికీ అందు బాటులోకి రాలేదు. వీటిని ఏర్పాటు చేయాలని 2016లోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినా.. నేటికీ అది సాకారం కాలేదు. దీంతో చేసేది లేక.. కొందరు మహిళా లోకోపైలట్లు అడల్ట్ డైపర్లు వాడుతున్నారు.. మరికొందరు డ్యూటీకెళ్లేటప్పుడు నీళ్లు తాగడం మానేస్తున్నారు. ఫలితంగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు.
మా సమస్యను పట్టించుకునేవారేరి?
వాష్‌రూం లేకపోవడం వల్ల స్త్రీ, పురుష లోకోపైలట్లు ఇద్దరికీ ఇబ్బంది అయినా.. తమ సమస్యలు వేరని తమిళనాడుకు చెందిన సీనియర్ మహిళా లోకోపైలట్ ఒకరు చెప్పారు. ‘మెయిన్ జంక్షన్లలో తప్పితే.. చాలా స్టేషన్లలో 1–5 నిమిషాలు మాత్రమే రైలును ఆపుతారు. ఆ టైంలోనే వెనుక ఉన్న బోగీకి లేదా స్టేషన్‌లోని వాష్‌రూంకు వెళ్లి.. పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమయానికి తిరిగి రాకపోతే.. ట్రైన్ నిర్ణిత సమయం కన్నా ఎక్కువ సేపు ఆగితే.. వివరణ ఇచ్చుకోవాలి.
దాని కన్నా.. వెళ్లకపోవడమే బెటరని చాలామంది భావిస్తారు’అని ఆమె చెప్పారు. ఇలాంటి పరిస్థితుల వల్ల తాను కూడా మూత్రనాళ సంబంధిత ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డానని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. తమ సమస్యలను పట్టించుకునేవారేరి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా.. ఒకసారి ఇంజన్ క్యాబిన్‌లోకి ప్రవేశిస్తే విధులు ముగిసేవరకు బయటకు వెళ్లడం సాధ్యం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లవలసి వస్తే వాకీటాకీల్లో పై అధికారులకు సమాచారం అందజేయాలి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మహిళా లోకోపైలట్లు చెబుతున్నారు.
పైగా కొన్ని చోట్ల స్టేషన్లు చాలా ఖాళీగా ఉంటాయి. అలాంటి స్టేషన్లలో వాష్‌రూంను వినియోగించడమంటే తమ భద్రతను పణంగా పెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎనిమిది గంటల డ్యూటీ అంటారు. కానీ ఒక్కసారి బండెక్కితే పదకొండు గంటలు దాటిపోతుంది.అప్పటి వరకు ఆపుకోవాల్సిందే’అని దక్షిణ మధ్య రైల్వేలో విధులు నిర్వహిస్తున్న ఒక సహాయ మహిళా లోకోపైలట్ ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రాన్ని ఆపుకోవడం లేదా నీళ్లు తక్కువగా తాగడం వల్ల మహిళల్లో మూత్రనాళం, కంటి సంబంధిత ఇన్‌ఫెక్షన్లు వస్తాయని, ఇది ప్రమాదకరమని ప్రముఖ గైనకాలజిస్ట్ శాంతి రవీంద్రనాథ్ హెచ్చరించారు.
రైలు నడుపుదామనుకున్నా.. కానీ..
⇒ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది లోకో పైలట్ అవ్వాలని వచి్చ.. డెస్క్ జాబ్‌లో సర్దుకుంటున్నారు. .. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని ఉండేది. లోకో పైలట్ క్వాలిఫై అయి ఐదేళ్లయింది. వాష్‌రూం లేని చోట పనిచేయడం ఇబ్బందని.. డెస్క్ జాబ్ చేస్తున్నాను’అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మహిళ చెప్పారు. తాను లోకోపైలట్ అయినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యానని.. అయితే మహిళలు శానిటరీ న్యాప్కిన్లు ధరించి డ్యూటీకి రావాల్సిన దుస్థితిని కల్పిస్తున్న ఇలాంటి పని వాతావరణంలోకి రావడానికి ఎందరు ఇష్టపడతారని ఓ లోకోపైలట్ ప్రశ్నించారు.
నెలసరి సమయంలో మరిన్ని ఇబ్బందులు పడలేక.. సెలవు పెట్టడమే బెటరని భావిస్తున్నట్లు చెప్పారు. రన్నింగ్ డ్యూటీలు చేయలేని వాళ్లకు స్టేషన్‌డ్యూటీలు అప్పగించే వెసులుబాటు ఉంది. కానీ అధికారులు అంతగా ఇవ్వడం లేదు. ప్రెగ్నెన్సీతో విధులకు హాజరయ్యే మహిళలకు మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తున్నారు. ‘గతంలో చాలాసార్లు స్టేషన్ డ్యూటీ ఇవ్వాలని అధికారులను వేడుకున్నా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కావడం వల్ల స్టేషన్ డ్యూటీ ఇచ్చారు’అని సికింద్రాబాద్‌కు చెందిన రేవతి చెప్పారు.
చేస్తామని చెప్పి.. చేయలేదు
రైలింజన్లలో వాష్‌రూంలు లేకపోవడంపై ద ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్స్ ఆర్గనైజేషన్ మాజీ అధ్యక్షుడు అలోక్ వర్మ అప్పట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ప్రతి ఇంజన్ క్యాబిన్‌లో ఏసీ సదుపాయంతో పాటు వాష్‌రూమ్‌ను ఏర్పాటు చేయాలని హక్కుల కమిషన్ 2016లో ఆదేశించింది. దీనికి సమాధానంగా అన్ని రైళ్లలో వాష్‌రూంను ఏర్పాటు చేస్తామని రైల్వే చెప్పింది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదు. దేశంలో కొన్ని డివిజన్లలోని ఇంజన్లలో వీటి ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ.. క్లీనింగ్ తదితర నిర్వహణ సమస్యలతోపాటు ఇంజిన్‌లోకి లోకోపైలట్ మినహా ఎవరినీ అనుమతించ రాదనే నిబంధనలు వంటి కారణాలతో దాన్ని అమలు చేయలేదని అధికారులు చెబుతున్నారు.
ఇది లోకోపైలట్ల కనీస హక్కులను హరించడమేనని అలోక్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం వస్తున్న వందేభారత్‌లలో ఈ సమస్య పెద్దగా లేదని చెప్పారు. మిగతావాటి పరి స్థితి ఏమిటని ప్రశ్నించారు. అమెరికా, యూరప్, బ్రిటన్‌లలో లోకోపైలట్లకు ప్రతి 4 గంటలకు 20–25 నిమిషాల బ్రేక్ ఉంటుందని చెప్పారు. – సాక్షి, హైదరాబాద్/సాక్షి, సెంట్రల్‌డెస్క్
కమిటీ వేసినా.. ముందడుగు పడలేదు..
రైలింజన్లలో వాష్‌రూంలు, సరైన విశ్రాంతి గదులు వంటి సదుపాయాలు కల్పించాలని ఇప్పటికి అనేక సార్లు రైల్వేబోర్డుకు విన్నవించాం. 3 నెలల క్రితమే రైల్వే బోర్డు ఒక కమిటీని వేసింది. అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు. – మర్రి రాఘవయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్‌ఎఫ్‌ఐఆర్)
Comments
Please login to add a commentAdd a comment