సభలో జరిగింది కాంగ్రెస్ వ్యూహంలో భాగమే: సుష్మా
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, దాన్ని తాము అంగీకరించడం లేదని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. స్పీకర్‌తో భేటీ అనంతరం ఆమె మీడియూతో మాట్లాడారు. ‘‘గురువారం సభలో జరిగింది దురదృష్టకరమే గాక సిగ్గుచేటు కూడా. ఇందుకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. పార్లమెంటు హుందాతనాన్నీ, సంప్రదాయాలనూ మంటగలిపారు. సభ్యులందరూ లోక్‌సభను వీడిన తర్వాత, తెలంగాణ బిల్లును పెట్టామంటూ నమ్మించేలా ఓ తంతు నడపజూశారు. బిల్లును ఇంత బాధ్యతారహిత పద్ధతిలో సభలో పెడతారని మేం కలలో కూడా ఊహించలేదు’’ అని తూర్పారబట్టారు.
తెలంగాణ బిల్లుతో పాటు ఏ విషయం మీదా కేంద్రంతో ఇక మీదట ఎలాంటి సంప్రదింపులూ జరపబోమని సుష్మ ప్రకటించారు. తెలంగాణ బిల్లు పెడుతున్నట్టుగా గురువారం లోక్‌సభ చేపట్టబోయే కార్యకలాపాల అజెండాలో పేర్కొననే లేదన్నారు. మధ్యాహ్నం దాకా అనుబంధ అజెండాలో కూడా ఆ అంశం లేదన్నారు. మధ్యాహ్నం 2 గంటలప్పుడు బిల్లును అనుబంధ అజెండాలో చేర్చారంటూ ఆక్షేపించారు. ‘‘నేను గురువారం ఆసాంతం సభలోనే ఉన్నాను. పెప్పర్ స్ప్రే ఉదంతం జరిగినప్పుడు, ఆ తర్వాత కూడా సభలోనే కూర్చుని ఉన్నా. నా ఆరోగ్యానికి హాని కలగవచ్చు గనుక వెళ్లిపోవాలంటూ మార్షల్స్ సలహా ఇచ్చేదాకా కదల్లేదు. స్పీకర్ ఎప్పుడొచ్చారో, బిల్లును సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారో కూడా నాకు తెలియదు. నేను సభలో ఉన్నంతసేపూ కనీసం బిల్లును ‘ప్రవేశపెడుతున్నాం’ అన్న పదంలో తొలి అక్షరాన్ని కూడా ఉచ్ఛరించిన (ప్రభుత్వం) పాపాన పోలేదు’’ అని చెప్పుకొచ్చారు.
‘‘స్పీకర్ ఇంకా సభలోకి కూడా రాకముందే గందరగోళం మొదలైంది. కాంగ్రెస్ ఎంపీలే ముందుగా పరస్పరం భౌతిక దాడులకు దిగారు. తర్వాత ఏదో చల్లారు. దాంతో ఎంపీలంతా దగ్గసాగారు’’ అని వివరించారు. ఇదంతా కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే జరిగిందని ఆరోపించారు. ఇలా గలాభా జరగాలనే కాంగ్రెస్ కోరుకుందన్నారు. ‘‘పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం (ఏ బిల్లును ప్రవేశపెట్టినా) ముందుగా మధ్యాహ్న వేళకల్లా పత్రాలను సమర్పిస్తారు. తర్వాత సభా కార్యకలాపాలు మొదలవుతాయి. కానీ (తెలంగాణ బిల్లు విషయంలో) ఎలాంటి పత్రాలనూ సమర్పించలేదు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నోటీసులిచ్చారు’’ అని చెప్పారు. తృణమూల్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సుదీప్ బంధోపాధ్యాయ కూడా యూపీఏ, కాంగ్రెస్‌ల వైఖరిని దుయ్యబట్టారు. బిల్లు పెడుతున్న విషయమే ఎంపీల్లో అత్యధికులకు తెలియదని, మొత్తం ప్రక్రియను కాంగ్రెస్ గబ్బు పట్టించిందని విమర్శించారు.