రూ. 3 కోట్లకు అమ్మిపెడతా... సిద్ధమా!
- ఆస్తుల వెల్లడిపై లోకేశ్‌ది బోగస్ సమాచారం: తలసాని
ఆస్తుల వెల్లడిపై నారా లోకేశ్ అంతా బోగస్ సమాచారమిచ్చి తానేదో సత్యహరిశ్చంద్రుడిలా చెప్పుకుంటున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. ‘‘జూబ్లీహిల్స్‌లో కోట్లు పలికే ఇంటి విలువను కేవలం రూ.24 లక్షలుగా లోకేశ్ పేర్కొనడం విడ్డూరం. దాన్ని రూ.3 కోట్లకు అమ్మిపెట్టిస్తా. అమ్మేందుకు సిద్ధమా?’’ అని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి తలసాని మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
ఏపీ సీఎం కుటుంబ ఆస్తుల వ్యవహారంలో ఆంధ్ర మీడియా హైప్‌ను సృష్టించిందని, చంద్రబాబు, ఆయన సన్నిహితులతో తనకు మంచి సంబంధాలు ఉండేవని, అందువల్ల ఆయన ఆస్తులు ఎలా సంపాదించారు, వాటి విలువ ఎంత అనేది బాగా తెలుసన్నారు. విజయవాడలో ఉండే పాలన చేసుకుంటేనే బాబు ఆరోగ్యానికి మంచిది అని తలసాని హితవు పలికారు. ఏపీ అసెంబ్లీని నాలుగు రోజులే నిర్వహించారని, ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కారని, అందుకు భిన్నంగా తెలంగాణ అసెంబ్లీని వీలైనన్నీ ఎక్కువరోజులు నిర్వహించడంతో పాటు అన్ని విషయాలు మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఇస్తామన్నారు.
ఇంట్లో కూర్చున్నా గెలుస్తా...: సనత్‌నగర్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే ఇంట్లో కూర్చున్నా గెలుస్తానని తలసాని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరి-మార్చిలో జరగవచ్చునని, ఈ ఎన్నికల్లో తాము మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, వచ్చే మూడేళ్లలో జరిగే అభివృద్ధి చూసి మనమే ఆశ్చర్యపోతామని చెప్పారు. ప్రాజెక్టులు రీ డిజైన్ చేశాక, వ్యవసాయానికి 9 గంటల సరఫరా చేసి సీఎం నీటి పారుదల వనరులను రైతులకు అందుబాటులోకి తెస్తారని, దీంతో ఆత్మహత్య లు తగ్గుతాయని అన్నారు. పొలిటికల్ కెరీర్ అనేది ఒక సైకిల్ వంటిదని, ఒక రాజకీయవేత్త ఒకచోట నుంచి మరోచోటకు మారవచ్చునన్నారు. తలసానితో కాంగ్రెస్ నేత దానం నాగేందర్ భేటీ కావడంపై ప్రశ్నించగా ఆయన పైవిధంగా బదులిచ్చారు.