
ఫొటో ఎందుకు తీసేశారో మరి!
సాక్షి, అమరావతి: ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తుంది? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ ప్రశ్నిస్తుంటే ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సమాధానం చెప్తున్నట్టుగా లేదూ! కావాలంటే కాస్త జాగ్రత్తగా వారి ముఖకవళికలను గమనించండి.. అక్కడేం జరిగి ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఫేస్‌బుక్‌లో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో ఈ ఫొటోను చూసిన కొందరు నెటిజన్లు తాము అర్థం చేసుకున్న విషయాన్నే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చిన రాజప్పను లోకేశ్ నిలదీస్తున్నట్లు భావించిన నెటిజన్లు దానిపై విస్తృతమైన చర్చ జరిపారు. పలు న్యూస్ సైట్లలోనూ లోకేశ్ తీరుపై ఫొటోతో సహా పలు కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని ‘సాక్షి’ ప్రచురించింది. సాక్షి కథనంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు.
ఫేస్‌బుక్‌లోని అధికారిక పేజీ నుంచి ఆ ఫొటోను తొలగించారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి విడుదల చేశారు. అయితే ఈ ఫొటోకు సంబంధించిన దృశ్యం ఆ వీడియోలో కనిపించకపోవడం గమనార్హం. మరోవైపు లోకేశ్ తనను ఏమీ అనలేదని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. నెటిజన్ల చర్చను ప్రచురించిన ‘సాక్షి’ని విమర్శిస్తూ లోకేశ్ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. అసలక్కడేమీ జరగనప్పుడు ఆ ఫొటో ఎందుకు తొలగించారో, ఆ వీడియోలో ఫొటోకు సంబంధించిన దృశ్యం ఎందుకు లేదనే ప్రశ్నలకు సమాధానం మాత్రం లేదు.
జగన్‌కు లోకేశ్ బహిరంగ లేఖ
ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో తనకు ఉన్నది అభిమానపూర్వక సంబంధాలేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. తమ ఇద్దరి సంబంధాలపై వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ లోకేశ్ శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తాను, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు చిన్నరాజప్ప ఉన్న ఫోటోకు వక్రభాష్యాలు జోడించి ‘సాక్షి’లో నిరాధార వార్తలు ప్రచురించారని లేఖలో తప్పుపట్టారు. పార్టీలో సీనియర్ నాయకులను అవ మానించే కుసంస్కారం తనకు లేదని పేర్కొన్నారు. దుష్ర్పచార రాజకీయాలు మాని నిర్మాణాత్మక రాజకీయాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.