మ్యూచువల్ ఫండ్‌పై రుణం కావాలా?
పర్సనల్ లోన్‌కన్నా తక్కువ వడ్డీకే లభ్యం
దాదాపు అన్ని బ్యాంకులూ, ఎన్‌బీఎఫ్‌సీలలో లభ్యం
ఎంపిక చేసిన మ్యూచువల్ ఫండ్లకు మాత్రమే వర్తింపు
ఫండ్ యూనిట్లు తనఖాలో ఉన్నా... డివిడెండ్లు మీకే
అత్యవసర నిధి అందరికీ అవసరమే. ఇది జీతానికి ఎన్ని రెట్లు ఉండాలనే విషయమై నిపుణులు రకరకాలుగా చెబుతుంటారు. మరి ఇలా బ్యాంకులో అత్యవసర నిధి కోసం కొంత మొత్తం దాచుకోవాల్సిందేనా? నిజానికి అప్పటికప్పుడు రుణాన్నిచ్చే పెట్టుబడి సాధనాల్ని కూడా అత్యవసర నిధిగానే భావించవచ్చు. అలాంటి వాటిలో మ్యూచ్‌వల్ ఫండ్లు కూడా ఒకటి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానం (సిప్) ద్వారా పెట్టుబడి పెడుతున్నా... లేక ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేసినా చాలు. అత్యవసరంగా డ బ్బులు కావాల్సి వచ్చినపుడు వీటిని అమ్మేయాల్సిన పనిలేదు. తనఖా పెట్టి కూడా ఏ బ్యాంకు నుంచో, ఎన్‌బీఎఫ్‌సీ నుంచో తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు. అదెలాగో చెప్పేదే ఈ కథనం...
మీరు గనక మ్యూచు వల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నట్లయితే ఆ పత్రాల్ని త నఖా పెట్టుకుని రుణమో, లేకపోతే ఓవర్‌డ్రాఫ్టో కావాలని మీ దగ్గర్లోని బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీని అడగొచ్చు. ఇలా రుణమివ్వటానికి ముందు బ్యాంకులు ఆ యూని ట్లను తాత్కాలికంగా తమ పేరిట ‘లీన్’లో ఉంచుకుంటాయి. లీన్ అంటే... ఒకరకంగా యాజమాన్య హక్కుల్ని సదరు బ్యాంకుల పేరిట బదలాయించటమే. మీరు రుణం తీర్చలేని సందర్భంలో వాటిని విక్రయించే హక్కు వాటికుంటుందన్న మాట. సదరు ఫండ్ యూనిట్ల విలువను బట్టి మీకు ఎంత రుణమివ్వాలో నిర్ణయిస్తాయి. ఆ రుణాన్ని తిరిగి చెల్లించేశాక ‘లీన్’ను ఎత్తివేసి, యాజమాన్య హక్కుల్ని మీ పేరిట బదలాయిస్తాయి.
అయితే లీన్ కోసం మీకు మ్యూచ్‌వల్ ఫండ్లు జారీ చేసిన ఫండ్ హౌస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు పేరిట సదరు యూనిట్లను లీన్ ఇవ్వాల్సిందిగా అడగాలి. ఈ మేరకు యూనిట్ల హక్కుదారు సంతకం చేసిన లేఖను ఫండ్‌హౌస్‌కు సమర్పించాలి.
రుణంగా ఎంతిస్తారు?
మీ దగ్గరున్న యూనిట్లను, వాటి విలువను బట్టే కాక... ఏ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తనఖా పెడుతున్నారన్న దానిపై కూడా రుణం విలువ ఆధారపడి ఉంటుంది. సహజంగా అప్పటికి ఉన్న విలువలో 50 శాతాన్ని రుణంగా పొందే అవకాశముంటుంది. కొన్ని బ్యాంకులైతే కనిష్ఠం- గరిష్ఠం ఎంతిస్తామనేది ఒక పరిమితి విధించుకుంటాయి. వాటిని బట్టి రుణం ఇస్తుంటాయి. చాలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు షేర్లపై రుణాలిస్తుంటాయి. ఆ పరిధిలోనే మ్యూచువల్ ఫండ్లపై కూడా రుణాలిస్తాయి. వడ్డీ సాధారణంగా పర్సనల్ లోన్ రేటు కంటే తక్కువే ఉంటుంది. అయితే సదరు ఫండ్లలోని రిస్కును బట్టి బ్యాంకులు ఈ వడ్డీని నిర్ణయిస్తుంటాయి.
రుణం తీసుకోవటానికి ముందు...
అన్ని ఫండ్ యూనిట్లపైనా రుణం రాదు. బ్యాంకులు ఎంపిక చేసిన జాబితాలోని ఫండ్ యూనిట్లపై మాత్రమే రుణమిస్తూ ఉంటాయి.అనుమతించిన ఈక్విటీ, డెట్ ఫండ్ యూనిట్ల రెండింటిపైనా రుణమిస్తారు.బ్యాంకులైతే అన్నీ ఈ రుణాలివ్వవచ్చు. ఎన్‌బీఎఫ్‌సీల దగ్గరకు వచ్చేసరికి 100 కోట్ల పైబడి ఆస్తులున్నవి మాత్రమే ఈ రుణాలివ్వవచ్చని ఆర్‌బీఐ చెబుతోంది.రుణం తీరేదాకా ఈ యూనిట్లను విక్రయించజాలరు. కానీ వీటిపై వచ్చే డివిడెండ్ నేరుగా మీకే అందుతుంది.
రుణం తిరిగి చెల్లించటంలో విఫలమైతే... లీన్‌ను ఉపయోగించుకుని వాటిని విక్రయించి డబ్బులివ్వాల్సిందిగా ఫండ్ హౌస్‌ను బ్యాంకులు కోరుతాయి. నిజానికి మ్యూచువల్ ఫండ్లపై రుణాలు తీసుకోవచ్చని చాలామందికి తెలియదు. దీంతో ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటం లేదని, దీనివల్ల కాస్త తక్కువ వడ్డీకే రుణాలొస్తాయని బ్యాంకులు చెబుతున్నాయి.