సాక్షి, హైదరాబాద్: పిల్లల చదువులు... వారి పెళ్లిళ్లు, రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలకు అనుగుణంగా జీవిత బీమా, పోస్టాఫీస్ సేవింగ్స్, ఎఫ్‌డీ, ఆర్‌డీ తదితర మార్గాల్లో పొదుపు చేయడంలో దిట్టలైన భారతీయులు అత్యవసర పరిస్థితులు ఎదురైతే మాత్రం చేతులెత్తేస్తారట! కోవిడ్ తరహాలో ఏదైనా అత్యవసరాలకు 75 శాతం భారతీయుల వద్ద నిధులు అందుబాటులో ఉండటం లేదని ఓ అధ్యయనం పేర్కొంది.
అనూహ్యంగా ఉద్యోగాలు ఊడినా, ఉన్నపళంగా తీవ్ర అనారోగ్యం పాలైనా ఎదుర్కొనేందుకు కేవలం 25 శాతం మందే సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆర్థికంగా సిద్ధమయ్యేలా వ్యవహరిస్తున్నా ‘ఎమర్జెన్సీ ఫండ్ ప్లానింగ్’పై మాత్రం అంతగా ముందుచూపుతో వ్యవహరించడం లేదని వివరించింది. ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ ఫినోలాజీ సంస్థ ‘ఇండియన్ మనీ హాబిట్స్’పై జరిపిన పరిశీలనలో ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.
అత్యవసర నిధి ఉంచుకోవాలి..
ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ ఫండ్ అందుబాటులో ఉంచుకోవడంతోపాటు కుటుంబం మొత్తం కవరయ్యేలా నాణ్యమైన మెడికల్ కవర్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం కష్టపడి ఆదా చేసిన మొత్తంలో సింహభాగం ఆసుపత్రి ఖర్చులకే వ్యయంచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా మరేది అందుబాటులో లేకపోతేనే ఈ ఫండ్‌ను ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు. లిక్విడ్ ఫ్యూచర్ ఫండ్స్ అనేవి మరో ఆప్షన్‌గా నిలుస్తాయని, సేవింగ్స్ ఖాతా కంటే వాటిలోనే ఎక్కువ రిటర్న్స్ రావడంతోపాటు కేవలం ఒక రోజులోనే ఈ ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. నెలకు ఎంత మొత్తం ఆదా చేస్తున్నారనే సంబంధం లేకుండా కనీసం నెలకు రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు తక్కువ మొత్తాల్లోనైనా క్రమం తప్పకుండా ఆదా చేయడం అలవాటు చేసుకొవాలని చెబుతున్నారు.
ఎమర్జెన్సీ ఫండ్
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు విడిగా పెట్టే మొత్తమే ఎమర్జెన్సీ ఫండ్. ఉద్యోగం నుంచి ఉద్వాసన, అనారోగ్యం, ఏదైనా పెద్ద సమస్య ఎదురైనప్పుడు ఉపయోగపడేదే ఈ నిధి. ఇది అందుబాటులో లేనిపక్షంలో ఇతర ఆర్థిక అవసరాల కోసం విడిగా ఉంచిన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి రావడం, అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోంది
– పైసా బజార్ సీఈవో నవీన్ కుక్రేజా
అధ్యయనంలోని ముఖ్యాంశాలు..
♦ తమ తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయోభిలాషులను ‘అత్యవసర నిధి’ కింద భారతీయులు పరిగణిస్తారు.
♦ఉద్యోగం కోల్పోవడం లేదా ఏదైనా అకస్మాత్తుగా ఎదురయ్యే సమస్యను ఎదుర్కోవడంలో భాగంగా వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐ కట్టలేకపోతున్నారు.
♦ప్రతి ముగ్గురిలో ఒకరికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ అనేది అందుబాటులో లేదు.
♦తమ శాలరీ మొత్తం 15 రోజుల్లోనే ఖర్చయిపోతోందంటున్న 29 శాతం మంది.
Comments
Please login to add a commentAdd a comment