వైరల్ వీడియో ఎఫెక్ట్.. ఖాకీ అవుట్
లక్నో: కనీసం వృద్ధుడనే విచక్షణ కూడా లేకుండా రిక్షా కార్మికుణ్ని చితకబాదిన రైల్వే పోలీసుపై వేటు పడింది. లక్నో(యూపీ)లోని చార్‌బాగ్ ప్రాంతంలో ఓ రిక్షావాలాపై పోలీసు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఖాకీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దాష్టీకానికి దిగిన పోలీసు తీరును నెటిజన్లు తీవ్రస్థాయి ఖండిచారు.
అసలేం జరిగిందంటే..: లక్నో నగరంలోని రెండు అతి పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటి చార్‌బాగ్ స్టేషన్. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణికులు వచ్చిపోతుంటారిక్కడ. రద్దీ దృష్యా స్టేషన్ బయట ఆటోలు, రిక్షాలు నిలపరాదంటూ రైల్వే పోలీసులు ఇటీవలే హుకుం జారీచేశారు. శుక్రవారం స్టేషన్ ముందు ప్రయాణికులను రిక్షాలో ఎక్కించుకునే ప్రత్నంచేసిన రిక్షావాలను విశ్వజిత్ సింగ్ అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా ’స్టేషన్ ముందు రిక్షా నిలుపుతావట్రా..’ అంటూ చితకబాదాడు. తన్నుకుంటూ ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో పడేశాడు. అక్కడే ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ అమర్ సింగ్ కూడా వృద్ధ రిక్షావాలపై చేయిచేసుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. దీంతో కానిస్టేబుల్ విశ్వజిత్, ఎస్‌హెచ్‌వో అమర్ సింగ్ లను సస్సెండ్ చేస్తూ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు.