ఆప్ ర్యాలీలో అంబులెన్స్ చిక్కుకుని...
ఆప్ ర్యాలీలో అంబులెన్స్ చిక్కుకుని...
Published Mon, Dec 12 2016 12:36 PM | Last Updated on Wed, Apr 4 2018 7:03 PM
ప్రజాపోరాటం నుంచి పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకేమైతే మాకేంటి అన్నతీరుగా వ్యవహరిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం గిల్ రోడ్డులో ఆప్-ఎల్ఐపీ నిర్వహించిన ర్యాలీ వల్ల ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని అంబులెన్స్లో ఓ మహిళ మృతిచెందింది. కొత్త సిమ్లపురి ప్రాంతానికి చెందిన అవతార్ కౌర్ అనే ఆ మహిళ తక్కువ బ్లడ్ షుగర్, నీళ్ల విరేచనాలతో బాధపడుతోంది. ఆమెను గిల్ రోడ్డులోని గ్రేవాల్ ఆసుపత్రిలో చేర్పించగా.. మహిళ పరిస్థితి క్షీణించడంతో అక్కడి డాక్టర్లు మోడల్ టౌన్లో క్రిష్ణా ఆసుపత్రిని సంప్రదించాలని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిని మహిళను ఆ ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్లో బయలుదేరారు. కానీ గిల్ రోడ్డులో ఆప్ నిర్వహిస్తున్న ర్యాలీ వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్లో వారి అంబులెన్స్ చిక్కుకుపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ భేటీలో పాల్గొన్నారు.
20-25 నిమిషాల పాటు ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్లో తమ అంబులెన్స్ చిక్కుకుని పోయిందని ఆమె కొడుకు దేవేందర్ సింగ్ ఆరోపించారు. అంబులెన్స్ను ముందుకు కదిలేలా సహకరించాలని పలుమార్లు ప్రాధేయపడినట్టు, ఎవరూ సహకరించలేకపోయారని కన్నీరుమున్నీరయ్యారు. అంబులెన్స్లో తన తల్లి మరణించినట్టు చెప్పారు. రాజకీయ పార్టీ వల్ల తన తల్లి మరణించిందని ఆరోపించారు. ఆమె చనిపోయిన తర్వాత ఆగ్రహానికి లోనైన కుటుంబసభ్యులు వెంటనే రోడ్డుపై నిరసనకు దిగినట్టు ఏడీసీపీ ధృవ దాహియా చెప్పారు. అయితే వారు ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదును దాఖలు చేయలేదన్నారు. కొద్దిసేపు నిరసన చేసిన అనంతరం వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్లో ఇరక్కపోవడం వల్లనే మహిళ మరణించినట్టు గ్రేవాల్ ఆసుపత్రి కూడా ధృవీకరించింది.
Advertisement