బాబోయ్.. కుక్కలు!
ఇద్దరు చిన్నారులపై దాడి.. తీవ్ర గాయాలు
హైదరాబాద్: రాజధాని నగరంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు కనిపిస్తే చాలు రెచ్చిపోయి మీద పడుతున్నాయి. గురువారం ఆరేళ్ల చిన్నారితోపాటు ఓ హాస్టల్ విద్యార్థిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మహబూబ్‌నగర్ జిల్లా జాతరపల్లికి చెందిన శ్రీకాంత్ బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌లో గిరిజన సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ సమీపంలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.
హాస్టల్‌లో నీరు లేకపోవడంతో సాయంత్రం దగ్గర్లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. ఈ సమయంలో శ్రీకాంత్‌పై పిచ్చికుక్క దాడి చేసి నుదురు, కంటిరెప్పపై కరిచింది. స్థానికులు కుక్కను తరిమికొట్టి బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో ఘటన రామంతాపూర్‌లో చోటుచేసుకుంది. ధృతి అనే ఆరేళ్ల చిన్నారి ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు తయారై ఇంటి ముందు గేట్ వద్ద నిల్చుంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క ధృతిపై దాడి చేసింది. చిన్నారి కుడి కన్నుపై తీవ్రంగా గాయపర్చింది. తల్లిదండ్రులు చికిత్స కోసం పాపను ఆసుపత్రిలో చేర్చారు.