భౌపెడుతున్నాయ్..
జిల్లాలో శునకాల స్వైర విహారం
బెంబేలెత్తుతున్న జనం
యలమంచిలి : గ్రామీణ జిల్లాలో కుక్కల బెడద పెరిగిపోయింది. జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడి చేసి గాయపరుస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. రెండురోజుల క్రితం రాంబిల్లి మండలం కుమ్మరాపల్లిలో నిద్రపోతున్న ఏడాది చిన్నారి మౌనికపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. దీనిని మరిచిపోక ముందే ఇదే మండలంలోని కొత్తపేటలో ఆదివారం మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది కుక్కలు ఒక వ్యక్తిపై దాడిచేసి ప్రాణాలు హరించడం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల క్రితం యలమంచిలి రామ్‌నగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు పెంపుడు కుక్క కరవడంతో రేబిస్ సోకి చనిపోయాడు. గ్రామీణ జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట సహా పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏ వీధిలో చూసినా గుంపులుగా శునకాలు సంచరిస్తున్నాయి.
దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులు వాటి నుంచి తప్పించుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. కుక్కల కారణంగా పాదచారులే కాకుండా వాహనచోదకులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని కుక్కలు వెంబడిస్తున్న సంఘటనలు ఎన్నో. రాత్రిళ్లు వీధుల్లో పాదచారులు నడిచి వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ సీజన్లో శునకాల పునరుత్పత్తి అధికంగా ఉంటుందని పశువైద్యులు చెబుతున్నారు. వీటిని నియంత్రించడానికి స్థానిక సంస్థలు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడంతో కుక్కకాటు బాధితులు పెరిగిపోతున్నారు. వీధి, పెంపుడు కుక్కల వల్ల నిరుపేదలే కుక్కకాట్లకు గురవుతున్నారు. వీరిలో కొందరు రేబిస్ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో ఏఆర్వీ వ్యాక్సిన్ తీసుకోవడం లేదు. దీంతో రేబిస్ కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కుక్కలను పెంచుతున్న యజమానులకు అవగాహన లేకపోవడంతో పెంపుడు కుక్కలకు టీకాలు వేయించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అవి కరచినపుడు రేబిస్ కోరల్లో చిక్కుకుంటున్నారు.
గత పదేళ్లలో రేబిస్ వ్యాధి సోకి మృత్యువాత పడినవారిలో 70 శాతం మంది సామాన్యులే ఉన్నారు. దీనిని బట్టి శునకాల స్వైర విహారంతో నిరుపేదలే సమిధలవుతున్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 2వేలకు పైగా వీధి కుక్కలు, 500 వరకు పెంపుడు కుక్కలు ఉన్నాయని అంచనా. మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటోంది. ఆ స్థాయిలో నియంత్రణ చర్యలు అధికారులు తీసుకోకపోవడం వలన శునకాల బెడదతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.