
'మ్యాగీ నూడుల్స్ హానికరం కాదు'
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నెస్లే గ్లోబల్ సీఈవో పాల్ బక్కే తెలిపారు. వివాదాల కారణంగా భారతీయ మార్కెట్ల నుంచి మ్యాగీ ఉత్పత్తులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. తమ మ్యాగీ నూడుల్స్‌లో హానికారక రసాయనాలు అధిక మొత్తాల్లో ఉన్నాయనే వార్తల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. నూడుల్స్ లో మోనో సోడియం గ్లుటామేట్ లేదని స్పష్టం చేశారు.
నాణ్యతా ప్రమాణాలే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. 30 ఏళ్లుగా భారతీయులు తమ ఉత్పత్తిని నమ్మారని చెప్పారు. భారత్ లో తాము పాటిస్తున్న ప్రమాణాలనే ప్రపంచమంతా పాటిస్తున్నామని పాల్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని పొంది మళ్లీ భారత్ మార్కెట్ లోకి వస్తామన్నారు. భారత్ మార్కెట్ తమకెంతో కీలకమని అందుకే తానిక్కడకు వచ్చానని చెప్పారు. తాము ఎక్కడ ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.