
అమితాబ్, మాధురి, ప్రీతిలపై మ్యాగీ కేసు
మ్యాగీ వివాదంలో కేసు నమోదైంది. దాని ప్రమాణాల విషయంలో నెస్లె ఇండియా సంస్థతో పాటు.. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, ప్రీతి జింటాలపైనా వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. నెస్లె సంస్థ తయారుచేసే 'మ్యాగీ.. 2 మినిట్ నూడుల్స్' ఉత్పత్తిని ప్రమోట్ చేసినందుకు వారిని కూడా కోర్టుకు లాగారు. నెస్లె ఇండియా, మరో ఐదుగురిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, మరో స్థానిక న్యాయవాది కూడా వేర్వేరుగా కేసులు పెట్టారు.
మ్యాగీ నూడుల్స్లో అనుమతించిన స్థాయికి మించి సీసం, మోనోసోడియం గ్లుటామేట్ అనే పదార్థాలు ఉన్నాయన్న కారణంతో ఎఫ్ఎస్డీఏ కమిషనర్ పిపి సింగ్ అనుమతి ఇవ్వడంతో.. శనివారం సాయంత్రం ఈ కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకి అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసులు నమోదయ్యాయి. మ్యాగీ శాంపిళ్లను ల్యాబ్లో పరిశీలించగా.. అందులో అనుమతించిన మోతాదు కంటే 17 రెట్లు ఎక్కువగా సీసం ఉందని తేలింది. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఈ వ్యవహారం ఏంటో చూడాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా కేంద్ర ఆహారభద్రతా ప్రమాణాల సంస్థను ఆదేశించింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో కూడా ఫిర్యాదు చేస్తే, క్లాస్ యాక్షన్ సూట్ను ప్రారంభించొచ్చని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అంటున్నారు.