మ్యాగీ మళ్లీ రావాలి.. తెస్తాం
కొన్ని నెలల క్రితం మ్యాగీపై నిషేధం అనగానే.. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం చెలరేగింది. కానీ ఇప్పుడు మళ్లీ దాన్ని మార్కెట్లలోకి తీసుకురావాల్సి ఉందని నెస్లె ఇండియా కొత్త అధినేత సురేష్ నారాయణన్ అంటున్నారు. స్విస్ సంస్థ అయిన నెస్లెకు భారత విభాగానికి అధినేతగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈ అంశంపై మాట్లాడారు. ప్రస్తుతానికి మ్యాగీ వివాదం కోర్టులో ఉంది కాబట్టి తాను దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, కోర్టు తీర్పును బట్టి తాము మళ్లీ మ్యాగీని మార్కెట్లలోకి ఎలా తీసుకురావాలో చూస్తామని ఆయన అన్నారు.
జూలై 25వ తేదీన నెస్లె ఇండియాకు ఎండీగా ఉన్న ఎటైన్ బెనెట్ పదవి నుంచి దిగిపోయారు. నారాయణన్ (55) శనివారం నాడు ఆ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. డెయిరీ ఉత్పత్తులు, చాక్లెట్లు.. ఇలా అన్నింటి అమ్మకాలను పెంచడం ద్వారా తమ మార్కెట్ను వృద్ధి చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. మ్యాగీ పయనం కూడా కొనసాగుతుందని.. దాంతో పాటే ఇతర విభాగాలపై కూడా దృష్టి సారిస్తామని నారాయణన్ అన్నారు. ఇన్నాళ్లూ ఫిలిప్పీన్స్లో చైర్మన్గా ఉన్న ఆయన.. ప్రత్యేకంగా భారతదేశానికి ఈ బాధ్యతల కోసమే వచ్చారు.