మా పార్టీ నుంచే సీఎం అభ్యర్థి: శివసేన
ముంబై: అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల మాత్రమే సమయం ఉండడంతో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సీఎం అభ్యర్థి ఏ పార్టీ నుంచి ఉండాలనే దానిపై ఇరు పార్టీల నేతలు మాటలు విసురుకుంటున్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే తన మనసులోని కోరిక వెల్లడించడంతో కమలనాథులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించడంతో బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. 'శివసేన, బీజేపీ సంబంధాలు బాగున్నాయి. సీఎం అభ్యర్థి మా పార్టీ నుంచే ఉంటారు' అని సంజయ్ రౌత్ తెలిపారు. శివసేన వ్యాఖ్యలపై తమ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారి తెలిపారు. వచ్చే ప్రభుత్వం తమ పార్టీ నాయకత్వంలో కొలువుతీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.