జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్పై విడుదల చేసే క్రమంలో... పెరోల్ నియమ నిబంధనలలో మార్పులకు శ్రీకారం చుడతామని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్. ఆర్.పాటిల్ వెల్లడించారు. మంగళవారం ఆయన ముంబైలో విధాన సభలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మహారాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఖైదీలు, వారి బంధువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా ధృక్పథంతో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్ పై విడుదల చేశామన్నారు.
అయితే ఖైదీలు దరఖాస్తు చేసుకున్న పెరోల్ విన్నపాన్ని జైలు శాఖ అధికారులు ముందుగా రెవెన్యూ కమిషనర్ కు పంపుతారని వారు అక్కడ పరిశీలించి ఆ తర్వాత హోం శాఖకు పరిశీలను పంపుతారన్నా విషయాన్ని మరువరాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఖైదీలకు పెరోల్పై విడుదల నిర్ణయం హోం శాఖ పరిధిలోని మాత్రమే కాదన్న సంగతి గుర్తించాలన్నారు. బాలీవుడ్ నటుడు, సంజయ్ దత్త్ ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఏరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తన భార్య మాన్యతకు తీవ్ర అనారోగ్యం చోటు చేసుకుందని, తనను పేరోల్పై విడుదల చేయాలని ఆయన జైలు అధికారులను దరఖాస్తు చేసుకున్నారు.
దాంతో గతేడాది మూడు సార్లు ఆయన పెరోల్పై విడుదలయ్యారు. దీంతో సర్వత్ర నిరసనలు వ్యక్తమైనాయి. దానిని నిరసిస్తు కొంత మంది ముంబై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) వేశారు. ఆ అంశాన్ని పరిశీలించిన ముంబై హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నితలంటింది. దాంతో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. అయితే సంజయ్ దత్త్ పేరోల్పై నివేదిక అందజేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే.