ఒక్కసారి కాదు వందసార్లు చంపండి!
కేఎల్‌ఓకు మమత సవాల్
కోల్‌కతా: ఫైర్‌బ్రాండ్ సీఎంగా గుర్తింపు పొందిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తనదైన శైలిలో మాటల తూటాలు రువ్వారు. అయితే, ఈసారి ఆమె ధ్వజమెత్తింది ఉత్తర బెంగాల్‌లోని కొన్ని జిల్లాలను కలిపి ప్రత్యేక కమతాపూర్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న కమతాపురి లిబరేషన్ ఆర్గనైజేషన్(కేఎల్‌ఓ) నేతలపైనే. గత డిసెంబర్‌లో జల్‌పాయ్‌గురి జిల్లాలో పేలుళ్లకు పాల్పడి ఆరుగురి మరణానికి కారణమైన కేఎల్‌ఓపై మమత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘అమాయక ప్రజలను హత్యచేయడం ద్వారా వాళ్లేం చేయాలనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. వాళ్లు(కేఎల్‌ఓ) నన్ను చంపాలనుకుంటే ఒక్కసారి కాదు వందసార్లు ఆపని చేయొచ్చు’ అని మమత సవాలు విసిరారు. ఇప్పటికైనా విధ్వంసాలను కట్టిపెట్టాలని కోరారు. ఉత్తర బెంగాల్‌లో ఏర్పాటు చేసిన మినీ సెక్రటేరియట్ ‘ఉత్తర్ కన్య’ను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భాష సహా కొన్ని డిమాండ్లను అడ్డం పెట్టుకుని సాగించే నరమేధాన్ని ప్రభుత్వం సహించబోదన్నారు. హింసా మార్గం డబ్బు దోచుకోడానికే ఉపయోగపడుతుందని కేఎల్‌ఓను దుయ్యబట్టారు. ఉత్తర బెంగాల్‌ను అభివృద్ధి బాటపట్టించేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు.