
బాల్యానికి సంకెళ్లు
ఆటలాడుకునే ప్రాయంలోనే అనేక మంది బాలికలకు పెళ్లి సంకెళ్లు పడుతున్నాయి. భవిష్యత్తును బంగారు మయంగా తీర్చిదిద్దాల్సిన తల్లిదండ్రులే బాల్య వివాహాలు
సంగారెడ్డి క్రైం : ఆటలాడుకునే ప్రాయంలోనే అనేక మంది బాలికలకు పెళ్లి సంకెళ్లు పడుతున్నాయి. భవిష్యత్తును బంగారు మయంగా తీర్చిదిద్దాల్సిన తల్లిదండ్రులే బాల్య వివాహాలు జరిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యత వల్లే జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా ఈ వివాహాలు వ్యవస్థకు సవాలుగా మారాయి. జిల్లాలో ఇటీవల కాలంలో 87 బాల్య వివాహాలు అధికారులు అడ్డుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం బాల్య వివాహాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిరక్షరాస్యత, ఆర్థిక సమస్యలు, మూఢనమ్మకాల కారణంగా ఈ వివాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో పటాన్‌చెరు, మెదక్, సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, అల్లాదుర్గం తదితర నియోజకవర్గాల పరిధిలో బాల్య వివాహాలు జరిగాయి. ఇటీవల పటాన్‌చెరు మండలం కిష్టారెడ్డిపేటలో బాల్య వివాహం చేసినందుకు ఆ కుటుంబంపై కేసు నమోదైంది. బాల్య వివాహాల నివారణకు ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యం త్రాంగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ, జస్టిస్ జువెనైల్ బోర్డు చైర్మన్ డి.దుర్గాప్రసాద్‌తో పాటు ఐసీడీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బాలల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
కొన్ని వివాహాలు తెర మీదకు వచ్చి నా వెలుగు చూడని పెళ్లిల్లు ఎన్నో. పెళ్లిళ్ల సీజన్ లో ఇవి మరీ ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సమాజంలో ఆడపిల్లలకు ఉన్న అభద్రతా భావాన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు, పెళ్లి చేస్తే భారం దిగిపోతుందని మరికొందరు తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. జిల్లాలో ఇటీవల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 87 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అలాగే పటాన్‌చెరు, సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో బాల్య వివాహాలు జరిపించిన వారిపై కేసులు నమోదు చేశారు.
చట్టం ఏం చెబుతోంది..
బాల్య వివాహాల నిరోధక చట్టం 1929లో అమలులోకి వచ్చింది. 2006లో ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేసి రెండేళ్ల జైలు శిక్షను చేర్చారు. బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు ఇరువర్గాల తల్లిదండ్రులు, పురోహితులు, మత, కుల పెద్దలు, బంధుమిత్రులు, ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, సామగ్రి సరఫరా చేసిన టెంటు వారు, పెళ్లికి హాజరైన వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో వీఆర్‌ఓ, మండల స్థాయిలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్, తహశీల్దార్, ఎంపీడీఓ, మూడు మండలాలకు ప్రాజెక్టు స్థాయిలో సీడీపీఓ, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయి లో కలెక్టర్ బాల్య వివాహాల నిరోధక అధికారులుగా నియమితులయ్యారు. పెళ్లి జరిగిన రెండేళ్ల లోపు కేసు నమోదు చేయవచ్చు.
బాధ్యత వారిదే...
బాల్య వివాహాలను అడ్డుకోవడం, అరికట్టడం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ శాఖదే పూర్తి బాధ్యత. గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు బాల్య వివాహాలు జరుగుతున్నట్టుగా గుర్తిస్తే ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 11 నుంచి 18 ఏళ్ల లోపు కిశోర బాలికల జాబితా అంగన్‌వాడీ కార్యకర్తల వద్ద ఉంటుంది. బాల్య వివాహాలపై కలెక్టర్, ఎస్పీ, ఐసీడీఎస్ పీడీ, ఆర్‌డీఓ, బాలల సంరక్షణ అధికారి, తహశీల్దార్, సీడీపీఓ, ఎస్‌ఐలకు ఫిర్యాదు చేయాల్సి వుంటుంది. 1098, 100 నంబర్లకు ఫోన్ చేసైనా తెలపాలి.
సమస్యలెన్నో...
చదువు, ఆటపాటలతో ఎదగాల్సిన బాలికలు ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోతారు. చిన్న వయసులోనే సంసార బాధ్యతలు మీద పడటంతో కుటుంబ కలహాలు, లైంగిక సమస్యలు ఎదురవుతాయి. గర్భాశయం పరిణతి చెందకపోవడంతో బిడ్డకు జన్మనివ్వడం కష్టమవుతుంది. ఒకవేళ జన్మనిచ్చినా తగినంత బరువు లేకపోవడం, తక్కువ నెలలకే కాన్పు వంటివి జరుగుతాయి. దీని వల్ల మాతా శిశు మరణాలు సంభవించే అవకాశముంది. శారీరక, మానసిక పరిపక్వత లేని సమయంలో గర్భం ధరించడంతో మాతా, శిశు మరణాలు చోటు చేసుకుంటాయి. రక్తహీనతకు గురవ్వడమే కాకుండా, అనారోగ్యం, అవయవాల ఎదుగుదల లేని శిశువులు పుడతారు.