మానేరు ‘ఫలహారం’ ఖరీదు అక్షరాలా 500 కోట్లు | maneru water project cost rises to 500 crores | Sakshi
Sakshi News home page

మానేరు ‘ఫలహారం’ ఖరీదు అక్షరాలా 500 కోట్లు

Published Thu, Dec 10 2015 4:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

మిడ్ మానేరు ప్రాజెక్ట్ వద్ద కొనసాగుతున్న పనులు(ఫైల్ ఫొటో)

మిడ్ మానేరు ప్రాజెక్ట్ వద్ద కొనసాగుతున్న పనులు(ఫైల్ ఫొటో)

- మిడ్‌మానేరు ప్రాజెక్టులో భారీ ఎత్తున పరిహారం స్వాహాకు స్కెచ్!
 - పరిహారం మదింపులో ఇష్టారాజ్యం అధికారుల నుంచి నేతల వరకు కుమ్మక్కు
-  రెండు గ్రామాల్లోనే రూ. 27 కోట్ల అక్రమాలను నిగ్గుతేల్చిన విజిలెన్స్ విభాగం
 - రూ. 29 వేల విలువ చేసే రేకుల షెడ్డుకు  రూ. 15.86 లక్షలతో అంచనా
-  ఎక్కడికక్కడ అంచనా విలువల తారుమారు అధికారుల సంతకాలూ ఫోర్జరీ
-  10 ముంపు గ్రామాలకుగాను 8 గ్రామాల్లో ఇవే సిత్రాలు.. ఒక్క చింతల్‌ఠాణాలోనే
 - రూ. 19 కోట్లు కొట్టేసే కుట్ర
 
 సాక్షి, హైదరాబాద్:
  అడ్డగోలు అంచనాలు.. ఇష్టారీతిన పరిహారం మదింపు.. అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు అంతా కుమ్మక్కు.. వెరసి కోట్లు కొట్టేసేందుకు పక్కాస్కెచ్! రూ. 29 వేలు కూడా విలువ చేయని రేకుల షెడ్డుకు రూ. 16 లక్షలు.. మంచం కూడా పట్టని ఇంటికి రూ.20 లక్షల అంచనా! మొత్తంగా రూ.500 కోట్లు స్వాహా చేసేందుకు భారీ కుట్ర. కొన్నిచోట్ల అంచనా విలువలనే ట్యాంపరింగ్ చేయగా, మరికొన్ని చోట్ల పత్రాలను మార్చేశారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా అధికారుల సంతకాలనే  ఫోర్జరీ చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల్లో జరిగిన అక్రమాల భాగోతమిదీ! ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 12 ముంపు గ్రామాలకు గానూ కేవలం 2 గ్రామాల్లో జరిపిన విచారణలో రూ.27.65 కోట్ల మేర అక్రమాలు బయటపడ్డాయి.
 
 భారీగా అక్రమాలు

 కరీంనగర్ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో మిడ్ మానేరు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2006లో రూ.2,466 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ప్రాజెక్టు కింద మొత్తంగా 13 గ్రామాలు ముంపు ప్రాంతాలుగా తేలగా, ఇందులో 10 గ్రామాల్లోని గృహాలు శాశ్వతంగా ముంపుకు గురవుతున్నాయి. ఇందులో అనుపురం, సంకెపల్లి మినహాయిస్తే సిరిసిల్ల మండల పరిధిలోని చింతల్‌ఠానా, చీర్లవంచ, బోయిన్‌పల్లి మండలంలో కొదురుపాక, నీలోజిపల్లి, వర్దవెల్లి, శాబాశ్‌పల్లి, వేములవాడ మండలంలోని రుద్రారం, కొడిముంజ గ్రామాలున్నాయి. ముంపు కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాలని నిర్ణయించి, ఇందులో 2013 వరకు 3,451 గృహాలకు పరిహారంగా రూ.311 కోట్లు చెల్లించారు. ఈ ఏడాదిలో 1,413 గృహాలకు మరో రూ.225.78 కోట్ల మేర చెల్లించారు. మరో 1,965 గృహాలకు రూ.250 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. పరిహారం చెల్లింపుల్లో అవకతవకలకుసంబంధించి 2009 చివర్లో ఫిర్యాదులు రాగా.. త్రిసభ్య కమిటీని నియమించినా అదేమీ తేల్చలేదు. తాజాగా గృహ నిర్మాణాల అంచనాలను పునఃపరిశీలన జరిపారు. ఇదే సమయంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సైతం విచారణ జరిపింది. పునఃపరిశీలన సందర్భంగా భారీస్థాయిలో అక్రమాలను గుర్తించారు.
 
 
 29 వేల రేకుల షెడ్‌కు 15.86 లక్షలు!

 2013 వరకు చేసిన చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకున్నా.. ఆ తర్వాత చెల్లించాల్సిన పరిహారాల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. తాజాగా  చెల్లించిన పరిహారంపై ఫిర్యాదుల నేపథ్యంలో కొడిముంజ, శాబాష్‌పల్లిలో విజిలెన్స్ విచారణ జరిపింది. ఇందులో కొడిముంజలో గృహ నిర్మాణ పరిహారాన్ని రూ.6.10 కోట్లతో అంచనా వేయగా... దాన్ని తర్వాత రూ.18.58 కోట్లకు పెంచినట్లు గుర్తించారు. శాబాష్‌పల్లిలో రూ.5.32 కోట్ల పరిహారాన్ని లెక్కిస్తే దాన్ని రూ.20.49 కోట్లకు పెంచారు. రెండు గ్రామాల్లోనే మొత్తంగా 27.65 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. కొడిముంజలో మేకల కొమురవ్వకు చెందిన రేకుల షెడ్‌కు రూ.29,742గా లెక్కగట్టగా దాన్ని అనంతరం ఏకంగా రూ.15.86 లక్షలకు పెంచారు. మరోచోట మంచం సైజున్న ఓ చిన్న ఇళ్లు విలువను రూ.20 లక్షలుగా లెక్కలేశారు. ఇలా అన్ని గృహాల నిర్మాణాల్లో అంచనాలను పెంచేశారు. మొత్తంగా 8 గ్రామాల పరిధిలో రూ.150 కోట్ల మేర అక్రమంగా నొక్కేసేందుకు ప్లాన్ చేశారు. అదే పరిహారాన్ని ఇప్పటి భూసేకరణ చట్టం నిర్దేశించిన రేట్ల ప్రకారం చెల్లించాల్సి వస్తే  అక్రమాల విలువ ఏకంగా రూ.500 కోట్లు ఉంటుందని ప్రభుత్వ వర్గాలే వెల్లడిస్తున్నాయి.
 
 అంచనాలన్నీ తారుమారు

 చాలాచోట్ల అంచనాలన్నీ తారుమారు చేశారు. ‘1’గా ఉన్న అంకెను ‘2’గా మార్చేశారు. అలా రూ.10 లక్షల విలువను రూ.20 లక్షలుగా మార్చేశారు. టేకు కలప క్వాంటిటీ ‘8’ మీటర్ల మేర ఉంటే దాని ముందు ‘2’ను చేర్చి 28 మీటర్లుగా మార్చారు. ఇలా అంకెలను మార్చడంతో రూ.10 లక్షల పరిహారం కాస్త రూ.40 లక్షలకు చేరింది. కొన్నిచోట్ల వాస్తవ పత్రాలను చింపేశారు. మరికొన్ని చోట్ల ఈఈల సంతకాలను ఫోర్జరీ చేశారు. సాధారణ కలపను టేకు కలపగా గుర్తించి లెక్కలు గట్టారు. గృహ నిర్మాణ వయసు నిర్ధారించడ ంలోనూ అవకతవకలు జరిగాయి. అంచనాల పెంపులో స్థానిక ప్రజాప్రతినిధులు మొదలు, అధికారుల ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ గుర్తించింది. మొత్తంగా 24 మంది అధికారుల పాత్రను తేల్చింది. ఇందులో 16 మంది ఆర్‌అండ్‌బీ, 8 మంది ఇరిగేషన్, ఇద్దరు ఎస్‌డీసీలు ఉన్నారు. వీరిపై చర్యలకు సంబంధించిన ఫైలు నీటిపారుదల శాఖకు చేరింది. వీరిపై త్వరలోనే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ వాస్తవ లెక్కల మేరకే పరిహారం ఇచ్చి గ్రామాలను ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. దళారులు అడ్డుపడుతున్నారు. ట్యాంపరింగ్ చేసిన విలువల మేరకే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏం చేయాలన్నది నీటి పారుదల శాఖకు తలనొప్పిగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement