maneru
-
సంక్రాంతి పండుగ మనవడితో సంతోషంగా చేసుకోవాలనుకున్నాడు.. అంతలోనే..
సాక్షి, కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సంక్రాంతి పండుగకు తన మనవడిని తీసుకువస్తున్న ఓ వ్యక్తి మానేరు నదిలో ఆ చిన్నారితో సహా గల్లంతయ్యాడు.. బాబు మృతదేహం లభ్యమవగా తాత ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. మీర్జంపేటకు చెందిన మార్క దేవేందర్(45)కు ఇద్దరు భార్యలు ఇందిర, కొమురమ్మ, కుమారులు బాలు, సాయి, వెంకటేశ్, కూతురు మౌనిక, తల్లిదండ్రులు ఉన్నారు. కూతురు మౌనికకు వీణవంక మండలం కిష్టంపేటకు చెందిన కోల శ్రీనివాస్‌తో వివాహం జరిపించారు. ఈ దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. అక్కడ శ్రీనివాస్ కూలి పనులు చేస్తున్నాడు. వీరికి యశ్వంత్(9), ఏడాది వయసున్న ఒక పాప ఉన్నారు. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో దేవేందర్ తన మనవడిని తీసుకువచ్చేందుకు హైదరాబాద్ వెళ్లాడు. సోమవారం యశ్వంత్‌ను తీసుకొని మీర్జంపేటకు బయలుదేరాడు. రైలెక్కి, జమ్మికుంటలో దిగి, ఆర్టీసీ బస్సులో వావిలాలకు వచ్చారు. అక్కడి నుంచి కాలినడకన మానేరు నది దాటుతూ స్వగ్రామం మీర్జంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ జారి, నీటిలో పడ్డారు. కొంత దూరంలో ఉన్న రైతులు గమనించి, గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. చదవండి: (‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’) గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టగా యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. రాత్రి వరకు వెతికినా దేవేందర్ ఆచూకీ లభించలేదు. ప్రమాద విషయం తెలుసుకున్న యశ్వంత్ తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి బయలుదేరినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దుర్ఘటనతో మీర్జంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే మానేరు నదిలో గల్లంతై, మృతి చెందిన మార్క దేవేందర్, ఆయన మనవడు యశ్వంత్‌ల కుటుంబసభ్యులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్ రెడ్డి పరామర్శించారు. ఈ సంఘటన దురదృష్టకరమని, ఇరు కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు వంగళ తిరుపతి రెడ్డి, సర్పంచ్ నాగార్జున్‌రావు, నాయకులు దేవేందర్, సదానందం, కొమురయ్య, ఓదెలు తదితరులున్నారు. -
మానేరు వాగులో 25 గంటల నిరీక్షణ
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరు వాగు వరదలో గొర్రెలకాపరి చిక్కుకుని 25 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చుట్టూ వరద రావడంతో ఎటూ వెళ్లలేక రాత్రంతా గొర్రెలతోపాటు ఉన్నాడు. ఇతని కోసం వెళ్లిన మరో ఐదుగురు కూడా వరదలో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారులు వీరిని బోటుసాయంతో ఒడ్డుకు చేర్చారు. వివరాలు... సిరిసిల్లలోని సాయినగర్‌కు చెందిన మొగిలి చంద్రమౌళి(58) గొర్రెలకాపరి. తనకున్న గొర్రెలు, మేకలను మేపేందుకు సోమవారం ఉదయం మానేరు మధ్యలో ద్వీపంలా ఉండే ప్రాం తానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వాగులో వరద ఉధృతి పెరగడంతో రెండు గొర్రెలు కొట్టుకుపోయాయి. దీంతో తెల్లవార్లు అతను వాగు మధ్యలో ఉండిపోయాడు. ఈ విషయాన్ని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. సిరిసిల్ల పట్టణం సాయినగర్కే చెందిన కె.రాజు(26), కె.అప్పారావు(22), ఎస్.విజయ్ (21), కె.రాజు(22), విజయ్(26) మంగళవారం ఉదయం చంద్రమౌళిని కాపాడేందుకు మానేరువాగు దాటి వెళ్లారు. తిరిగి వస్తుండగా వరద ఎక్కువకావడంతో వారూ వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని, గొర్రెలను ఒడ్డుకు చేర్చారు. మానేరులో కొట్టుకుపోయిన బస్సు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రం నుంచి లింగన్నపేట వెళ్లే దారిలో మానేరు వాగు వరదలో సోమవారం చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం కొట్టుకుపోయింది. ప్రయాణికులం తా సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. కాగా, మానేరు నది వరద పరిస్థితి, గేట్లు ఎత్తే విష యం పశువుల కాపర్లు, జాలర్లకు తెలిసిపోయేలా, వారిని అప్రమత్తం చేసేలా సిరిసిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పశువుల కాపర్లు, జాలర్లతో పాటు వీపీవోలు, వీఆర్ఏ, వీఆర్వోలు ఉంటారు. -
కరీంనగర్లో విషాదం
సాక్షి, కరీంనగర్ : మానేరు వాగులో ప్రమాదవశాత్తు పడి తల్లి కొడుకు మృతి చెందారు. మృతులు కాశ్మీర్ గడ్డకు చెందిన మహిళ సకీనా ఆమె మూడేళ్ళ కుమారుడు అహిల్ గా గుర్తించారు. కుటుంబంతో కలిసి సదాశివపల్లి వద్ద గల దర్గాకు వెళ్లి తీగల వంతెనవద్ద మానేరు వాగు లోకి దిగారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో తల్లి కొడుకు గల్లంతయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎల్ఎండీ గేట్లు మూసివేశారు. (చదవండి : హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య ) కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అప్రమత్తమై గాలించగా అప్పటికే తల్లి మృతి చెందింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకును పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. కళ్ళ ముందే ఇద్దరు వాగులోపడి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విహారయాత్ర దైవదర్శనం విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
మానేరు ‘ఫలహారం’ ఖరీదు అక్షరాలా 500 కోట్లు
- మిడ్‌మానేరు ప్రాజెక్టులో భారీ ఎత్తున పరిహారం స్వాహాకు స్కెచ్! - పరిహారం మదింపులో ఇష్టారాజ్యం అధికారుల నుంచి నేతల వరకు కుమ్మక్కు - రెండు గ్రామాల్లోనే రూ. 27 కోట్ల అక్రమాలను నిగ్గుతేల్చిన విజిలెన్స్ విభాగం - రూ. 29 వేల విలువ చేసే రేకుల షెడ్డుకు రూ. 15.86 లక్షలతో అంచనా - ఎక్కడికక్కడ అంచనా విలువల తారుమారు అధికారుల సంతకాలూ ఫోర్జరీ - 10 ముంపు గ్రామాలకుగాను 8 గ్రామాల్లో ఇవే సిత్రాలు.. ఒక్క చింతల్ఠాణాలోనే - రూ. 19 కోట్లు కొట్టేసే కుట్ర సాక్షి, హైదరాబాద్: అడ్డగోలు అంచనాలు.. ఇష్టారీతిన పరిహారం మదింపు.. అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు అంతా కుమ్మక్కు.. వెరసి కోట్లు కొట్టేసేందుకు పక్కాస్కెచ్! రూ. 29 వేలు కూడా విలువ చేయని రేకుల షెడ్డుకు రూ. 16 లక్షలు.. మంచం కూడా పట్టని ఇంటికి రూ.20 లక్షల అంచనా! మొత్తంగా రూ.500 కోట్లు స్వాహా చేసేందుకు భారీ కుట్ర. కొన్నిచోట్ల అంచనా విలువలనే ట్యాంపరింగ్ చేయగా, మరికొన్ని చోట్ల పత్రాలను మార్చేశారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల్లో జరిగిన అక్రమాల భాగోతమిదీ! ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 12 ముంపు గ్రామాలకు గానూ కేవలం 2 గ్రామాల్లో జరిపిన విచారణలో రూ.27.65 కోట్ల మేర అక్రమాలు బయటపడ్డాయి. భారీగా అక్రమాలు కరీంనగర్ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో మిడ్ మానేరు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2006లో రూ.2,466 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ప్రాజెక్టు కింద మొత్తంగా 13 గ్రామాలు ముంపు ప్రాంతాలుగా తేలగా, ఇందులో 10 గ్రామాల్లోని గృహాలు శాశ్వతంగా ముంపుకు గురవుతున్నాయి. ఇందులో అనుపురం, సంకెపల్లి మినహాయిస్తే సిరిసిల్ల మండల పరిధిలోని చింతల్ఠానా, చీర్లవంచ, బోయిన్పల్లి మండలంలో కొదురుపాక, నీలోజిపల్లి, వర్దవెల్లి, శాబాశ్పల్లి, వేములవాడ మండలంలోని రుద్రారం, కొడిముంజ గ్రామాలున్నాయి. ముంపు కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాలని నిర్ణయించి, ఇందులో 2013 వరకు 3,451 గృహాలకు పరిహారంగా రూ.311 కోట్లు చెల్లించారు. ఈ ఏడాదిలో 1,413 గృహాలకు మరో రూ.225.78 కోట్ల మేర చెల్లించారు. మరో 1,965 గృహాలకు రూ.250 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. పరిహారం చెల్లింపుల్లో అవకతవకలకుసంబంధించి 2009 చివర్లో ఫిర్యాదులు రాగా.. త్రిసభ్య కమిటీని నియమించినా అదేమీ తేల్చలేదు. తాజాగా గృహ నిర్మాణాల అంచనాలను పునఃపరిశీలన జరిపారు. ఇదే సమయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సైతం విచారణ జరిపింది. పునఃపరిశీలన సందర్భంగా భారీస్థాయిలో అక్రమాలను గుర్తించారు. 29 వేల రేకుల షెడ్‌కు 15.86 లక్షలు! 2013 వరకు చేసిన చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకున్నా.. ఆ తర్వాత చెల్లించాల్సిన పరిహారాల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. తాజాగా చెల్లించిన పరిహారంపై ఫిర్యాదుల నేపథ్యంలో కొడిముంజ, శాబాష్‌పల్లిలో విజిలెన్స్ విచారణ జరిపింది. ఇందులో కొడిముంజలో గృహ నిర్మాణ పరిహారాన్ని రూ.6.10 కోట్లతో అంచనా వేయగా... దాన్ని తర్వాత రూ.18.58 కోట్లకు పెంచినట్లు గుర్తించారు. శాబాష్‌పల్లిలో రూ.5.32 కోట్ల పరిహారాన్ని లెక్కిస్తే దాన్ని రూ.20.49 కోట్లకు పెంచారు. రెండు గ్రామాల్లోనే మొత్తంగా 27.65 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. కొడిముంజలో మేకల కొమురవ్వకు చెందిన రేకుల షెడ్‌కు రూ.29,742గా లెక్కగట్టగా దాన్ని అనంతరం ఏకంగా రూ.15.86 లక్షలకు పెంచారు. మరోచోట మంచం సైజున్న ఓ చిన్న ఇళ్లు విలువను రూ.20 లక్షలుగా లెక్కలేశారు. ఇలా అన్ని గృహాల నిర్మాణాల్లో అంచనాలను పెంచేశారు. మొత్తంగా 8 గ్రామాల పరిధిలో రూ.150 కోట్ల మేర అక్రమంగా నొక్కేసేందుకు ప్లాన్ చేశారు. అదే పరిహారాన్ని ఇప్పటి భూసేకరణ చట్టం నిర్దేశించిన రేట్ల ప్రకారం చెల్లించాల్సి వస్తే అక్రమాల విలువ ఏకంగా రూ.500 కోట్లు ఉంటుందని ప్రభుత్వ వర్గాలే వెల్లడిస్తున్నాయి. అంచనాలన్నీ తారుమారు చాలాచోట్ల అంచనాలన్నీ తారుమారు చేశారు. ‘1’గా ఉన్న అంకెను ‘2’గా మార్చేశారు. అలా రూ.10 లక్షల విలువను రూ.20 లక్షలుగా మార్చేశారు. టేకు కలప క్వాంటిటీ ‘8’ మీటర్ల మేర ఉంటే దాని ముందు ‘2’ను చేర్చి 28 మీటర్లుగా మార్చారు. ఇలా అంకెలను మార్చడంతో రూ.10 లక్షల పరిహారం కాస్త రూ.40 లక్షలకు చేరింది. కొన్నిచోట్ల వాస్తవ పత్రాలను చింపేశారు. మరికొన్ని చోట్ల ఈఈల సంతకాలను ఫోర్జరీ చేశారు. సాధారణ కలపను టేకు కలపగా గుర్తించి లెక్కలు గట్టారు. గృహ నిర్మాణ వయసు నిర్ధారించడ ంలోనూ అవకతవకలు జరిగాయి. అంచనాల పెంపులో స్థానిక ప్రజాప్రతినిధులు మొదలు, అధికారుల ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ గుర్తించింది. మొత్తంగా 24 మంది అధికారుల పాత్రను తేల్చింది. ఇందులో 16 మంది ఆర్అండ్బీ, 8 మంది ఇరిగేషన్, ఇద్దరు ఎస్డీసీలు ఉన్నారు. వీరిపై చర్యలకు సంబంధించిన ఫైలు నీటిపారుదల శాఖకు చేరింది. వీరిపై త్వరలోనే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ వాస్తవ లెక్కల మేరకే పరిహారం ఇచ్చి గ్రామాలను ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. దళారులు అడ్డుపడుతున్నారు. ట్యాంపరింగ్ చేసిన విలువల మేరకే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏం చేయాలన్నది నీటి పారుదల శాఖకు తలనొప్పిగా మారింది. -
మానేరులో భూగర్భ నీటి పరీక్షలు
జమ్మికుంట, న్యూస్‌లైన్ : జమ్మికుంట పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రతను చూ పుతూ ‘మా‘నీరు’ మహాప్రభో’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్ర చురితమైన కథనానికి నాయకులు, అధికారులు స్పందించారు. భూగర్భజల, ప్రజా ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులు విలాసాగర్‌లోని మానేరును ఉదయమే సందర్శించారు. భూగర్భజ లాల అసిస్టెంట్ డెరైక్టర్ హరికుమార్, జియాలజిస్ట్ మోహన్రా వు నీటి సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. నీటి శాతం పరిశీలించారు. వారి వెంట పబ్లిక్ ెహ ల్త్ రామగుండం డీఈ మహేందర్‌రెడ్డి, జమ్మికుంట నగర పంచాయతీ ఏఈ చంద్రమౌళి ఉన్నారు. ఇసుక తెచ్చిన ఇక్కట్లు మానేరులో వ్యాపారులు అక్రమంగా ఇసుక తోడేస్తుండడం ప్రజలకు శాపంగా మారినట్లు తెలుస్తోంది. జమ్మికుంటకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీర్చేందుకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ గత ఏడాది రూ.65 కోట్లతో టీపీఆర్ సిద్ధం చేసి ఎంపీ, ఎమ్మెల్యేలకు సమర్పించగా నిధుల మంజూరు కోసం వారు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను పరిశీలించిన ప్రభుత్వం నీటి సామర్థ్యం కోరుతూ భూగర్బజల శాఖ అనుమతి కోరింది. గతంలో ఆ శాఖ అధికారులు విలాసాగర్ శివారులోని మానేరును సందర్శించి నీటి పరీక్షలు చేసి ప్రభుత్వానికి నీటి సామర్థ్యం లేదంటూ, వేసవిలో నీటి కొరత ఉందంటూ నివేదిక సమర్పించారు. వాగు నుంచి ఇసుక రవాణాతో నీటి సరఫరా కష్టమని పేర్కొన్నారు. దీంతో రూ.65 కోట్లు నిలిచిపోయాయి. నీటి సమస్య తలెత్తదు.. వేసవిలో కాలువ నీళ్లతోపాటు, శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్ట్ నీళ్లు వస్తాయని ఎలాంటి నీటి సమస్య తలెత్తదని మున్సిపల్ అధికారులు భూగర్బ జల శాఖకు సూచించారు. తాజాగా భూగర్భజల అధికారులు ఇచ్చే నివేదికపైనే నిధుల మంజూరు ఆధారపడి ఉంది. పెరిగిన ఖర్చు.. తాగునీటి సమస్య పరిష్కారానికి మరో చిక్కు వచ్చి పడినట్లు తెలుస్తోంది. గతంలో తయారు చేసిన అంచనా వ్యయం మరో పది శాతం పెరిగినట్లు తాజా లెక్కలు తెలుపుతున్నాయి. అధికారుల వ్యతిరేక నివేదిక పుణ్యమా అని ఏడాదిలో రూ.పది కోట్లు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏదేమైనా భూగర్భ జల అధికారులు త్వరగా ప్రభుత్వానికి గ్రౌండ్వాటర్పై నివేదిక సమర్పిస్తేనే జమ్మికుంటకు నీటి కొరత తీరనుంది.