ధరల్ని తట్టుకునేదెలా? | Markets expect policy rates to remain unchanged | Sakshi
Sakshi News home page

ధరల్ని తట్టుకునేదెలా?

Published Sun, Jan 26 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

Markets expect policy rates to remain unchanged

శేఖర్‌ది ప్రైయివేటు ఉద్యోగం. జీతం నెలకు రూ. 25 వేలు. రెండేళ్ల కిందటైతే 22 వేలు. ఏడాదికి 5-6% చొప్పున మాత్రమే పెరిగింది. కానీ ఖర్చులో..? ఇంటద్దె ఒక్కటే ఈ రెండేళ్లలో రెండువేల వరకూ పెరిగింది. మిగిలిన ఖర్చుల సంగతి చెప్పాల్సిన పనేలేదు. వీటన్నిటినీ తట్టుకోవటానికి శేఖర్ సేవింగ్స్ మొత్తం హారతైపోయాయి. పెరుగుతున్న ఖర్చుల్ని ఎలా తట్టుకోవాలో తెలియక సతమతమవుతున్నాడు.

ఒక్క శేఖర్‌దే కాదు. జీతంపై ఆధారపడేవారిలో అత్యధికులది ఇదే పరిస్థితి. పెరుగుతున్న ధరలు... అందరినీ ఇదే పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ధరల పెరుగుదలనే... సాంకేతికంగా ద్రవ్యోల్బణంగా పిలుస్తున్నాం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవటం ఎలా?  దేన్లో పెట్టుబడులు పెట్టాలి? ఇదే ఈ వారం ప్రాఫిట్ కథనం...
 
 ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్లు..
     ధరల పెరుగుదల ఆధారంగా వీటిపై రాబడులు ఉంటాయి. నిర్దిష్ట కాలంలో నమోదైన ద్రవ్యోల్బణం కన్నా దాదాపు ఒకటిన్నర శాతం ఎక్కువ వడ్డీ వీటిపై లభిస్తుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 10% ఉందనుకుంటే.. మీకు ఏడాదికి 11.5 శాతం మేర వడ్డీ లభిస్తుందన్న మాట. ఆర్‌బీఐ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్‌డ్ నేషనల్ సేవింగ్స్ సెక్యూరిటీస్ (ఐఐఎన్‌ఎస్‌ఎస్-సీ) పేరిట వీటిని అందిస్తోంది.  వీటిలో పదేళ్ల కాలానికి కనీసం రూ.5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.5 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇటీవలే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు గడువును మార్చి నెలాఖరుదాకా ఆర్‌బీఐ పొడిగించింది. వడ్డీ ఆర్నెల్లకోసారి జమవుతుంది.

 ఉదాహరణకు.. మీరో లక్ష ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ద్రవ్యోల్బణం 10 శాతంగా, వడ్డీ రేటు దానిపై 1.5% అధికంగా ఉందనుకుంటే.. ఏడాదికి మీకు రూ.11,500 రావాల్సి ఉంటుంది. అయితే, ఆర్నెల్లకోసారి వడ్డీ జమ అవుతుంది కనుక.. ఆ కాలంలో మీకు రూ. 5,750 వడ్డీ వస్తుంది. ఇది అసలుకు జమ అయి.. మొత్తం 1,05,750 అవుతుంది.

ఒకవేళ, మిగతా ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం మరో అరశాతం పెరిగి 10.5 శాతానికి చేరిం దంటే.. మీకు 12 శాతం వడ్డీ వస్తుంది. అంటే..ఆ ఆరు నెలల కాలానికి రూ. 1,05,750 పైన సుమారు రూ. 6,345 దాకా లభిస్తుంది.

ఈ విధంగా ఏడాది తిరిగేసరికి.. రూ. 1లక్ష ఇన్వెస్ట్‌మెంట్ కాస్తా రూ.. 1,12,095కి పెరుగుతుంది. ద్రవ్యోల్బణానికి ఉన్న లింకుతో వీటిపై వడ్డీ రేటు కూడా మారుతుంటుంది. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గితే దానికి అనుగుణంగా వడ్డీ రేటూ తగ్గుతుంది. ద్రవ్యోల్బణం సున్నా స్థాయి కన్నా కిందికి (డిఫ్లేషన్) పడిపోతే కనీసం 1.5% వడ్డీ లభిస్తుంది.

ఈ ఇన్‌ఫ్లేషన్ బాండ్ల విషయంలో నిర్దిష్ట గడువులోగా వైదొలగాలనుకుంటే కొంత పెనాల్టీ పడుతుంది. ఈ బాండ్లను తనఖా పెట్టి రుణాలూ తీసుకోవచ్చు. ఈ బాండ్లు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. పన్నుపరమైన ప్రయోజనాలను చూస్తే.. అధికాదాయ వర్గాల కన్నా సాధారణ ఆదాయ వర్గాలకు (10, 20% పన్ను పరిధిలోని వారు) ఇది ఉపయోగకరంగా ఉంటుందని ట్యాక్సేషన్ నిపుణుల మాట. ఇటీవలే ఎల్‌అండ్‌టీ వంటి కార్పొరేట్ కంపెనీలు కూడా ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్లను జారీ చేశాయి.
 
 షేర్లు..మ్యూచువల్ ఫండ్లు..
 
 ద్రవ్యోల్బణం బారి నుంచి తప్పించుకునేందుకు దీర్ఘకాలిక ప్రాతిపదికన షేర్లు, మ్యూచువల్ ఫండ్ల లాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం కొంత ఉపకరిస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లకు కొలమానమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ గడిచిన పదేళ్లలో సగటున 16 శాతం మేర రాబడులిచ్చింది. ఇక ద్రవ్యోల్బణం ఈ పదేళ్లలో సగటున 7 శాతం మేర పెరిగింది. ఈక్విటీల్లో కనీసం మూడేళ్లు అంతకన్నా ఎక్కువ కాలమే ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు.

షేర్లలో పెట్టుబడులు పెట్టాలంటే వాటిపై కాస్తో కూస్తో అవగాహన తప్పనిసరి. మార్కెట్లు, ఆయా కంపెనీల పనితీరు, వాటిని ప్రభావితం చేసే అంశాల వంటివి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ వద్దని భావించేవారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిలోనూ నెలకింత చొప్పున పెట్టేలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) ఎంచుకోవచ్చు. ఫండ్స్‌ను ఎంచుకునేటప్పుడు  వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేసే డైవర్సిఫైడ్ స్కీములను ఎంచుకోవడం మంచిది.
 
 
 ప్రతికూల రిటర్న్‌లు..!
 బ్యాంకు డిపాజిట్లలో రిస్కనేది ఉండదు. చాలా సేఫ్. కానీ వీటిపై వచ్చే రాబడులు ద్రవ్యోల్బణం బారి నుంచి కాపాడలేకపోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ గరిష్టంగా 9% దాకా ఉండగా... ద్రవ్యోల్బణం 10 శాతాన్ని దాటుతోంది. మనకు 9 రూపాయలు వడ్డీ వస్తే ఇతరత్రా ధరల పెరుగుదల రూ.10 దాకా ఉందన్న మాట. మరో రూపాయి మన సేవింగ్స్ నుంచి పెట్టాలి.

వీటికితోడు వడ్డీపై ఆదాయపు పన్ను కూడా ఉంటుంది. మరో ప్రధాన విషయమేంటంటే ఈ ద్రవ్యోల్బణంలో ఇంటద్దె, స్కూల్ ఫీజు వంటివి ఉండవు. వాటి పెరుగుదల ఈ ద్రవ్యోల్బణానికి రెట్టంపు ఉంటుందనటం అతిశయోక్తి కాదు. అందుకని కాస్తో కూస్తో రిస్కున్నా ఇతర సాధనాల వైపు చూడక తప్పదు.
 
 
 
 బంగారం.. రియల్టీ
 పెట్టుబడుల విషయంలో మన దగ్గర బంగారం, రియల్ ఎస్టేట్‌కి ఉన్నంత క్రేజ్ మరో సాధనానికి లేదనడం అతిశయోక్తి లేదు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనడానికి ఇవి కూడా మంచి సాధనాలే. అయితే, ఇతర సాధనాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్‌లో ఒక్కసారిగా పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో పసిడి, రియల్టీ ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో మీ పోర్ట్‌ఫోలియోలో ఈ రెండింటికీ ఒక మోస్తరు నిధులు కేటాయిస్తే మంచిదే.
 
 
 చివరిగా ఒక్క విషయం.. ఏ సాధనంలోనైనా అంతర్గతంగా కొన్ని రిస్కులుంటాయి. ఎందులోనైనా డబ్బు పెడితే ఒకోసారి వంద రెట్లు పైగా లాభాలూ రావొచ్చు.. కొన్ని సార్లు అసలు రాకపోనూవచ్చు. అధిక రాబడులు కోరుకున్న పక్షంలో అధిక రిస్కులూ  ఉంటాయని గుర్తుంచుకోవాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement