న్యూఢిల్లీ : ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి మిడ్ సైజ్ ప్రీమియం సెడాన్ సియాజ్, దేశీయ మార్కెట్లో దూసుకెళ్తోంది. లక్ష క్యూములేటివ్ అమ్మకాల మైలురాయిని జూన్ లో చేధించినట్టు మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. ఈ కారును ఆవిష్కరించిన రెండేళ్లలో ఈ మైలురాయిని తాకినట్టు కంపెనీ తెలిపింది. 2014 అక్టోబర్ లో ఈ కారును దేశవ్యాప్తంగా విడుదలచేశారు. అప్పటినుంచి 2016 జూన్ వరకు 1,00,272 యూనిట్ల సియాజ్ మోడల్ అమ్ముడుపోయినట్టు మారుతీ సుజుకి ఇండియా(ఎమ్ఎస్ఐ) ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
ఏ3 ప్లస్ సెగ్మెట్ లో అత్యధికంగా అమ్మకాలు నమోదవుతున్న సెడాన్ గా సియాజ్ ఉందని ఎమ్ఎస్ఐ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఎస్ కల్సి చెప్పారు. ప్రీమియం సెడాన్ రంగంలో 40శాతం మార్కెట్ షేరును సొంతంచేసుకున్నట్టు వెల్లడించారు. 2016లో మొదటి ఐదు నెలల్లో.. సగటు నెల అమ్మకాలు 5వేల యూనిట్లకు పైగా నమోదయ్యాయని ఎమ్ఎస్ఐ తెలిపింది. ఈ కారులో వాడిన ఎస్ హెచ్ వీఎస్ లాంటి టెక్నాలజీ ఆవిష్కరణలు కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని కల్సి పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ ఎస్ హెచ్ వీఎస్ ఆప్షన్లలో సియాజ్ మార్కెట్లో అందుబాటులో ఉంది. గంటకు 28.09కిలోమీటర్ ఫ్యూయల్ ఎకనామీని సియాజ్ అందిస్తోంది. రూ.7.53 లక్షల నుంచి రూ.9.94లక్షల (ఎక్స్ షోరూం ఢిల్లీ) మధ్య ఈ మోడల్ ధరలు ఉన్నాయి. ఆఫ్రికా, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియన్, సార్క్ దేశాలకు ఈ మోడల్ ను ఎగుమతి చేస్తున్నారు. 2016 జూన్ చివరి కల్లా 18వేల యూనిట్లు ఎగుమతులు నమోదయ్యాయి.