Maruti ciaz
-
కొత్త మారుతి సియాజ్ వచ్చేసింది..సూపర్ సేఫ్టీ ఫీచర్లతో
సాక్షి, ముంబై: మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో తన అప్డేటెడ్ 'సియాజ్' లాంచ్ చేసింది. ఇది డ్యూయెల్ టోన్ పెయింటింగ్ స్కీమ్ పొందటంతో పాటు అదనపు సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది కేవలం ఆల్ఫా ట్రిమ్‌కి మాత్రమే పరిమితం చేయబడింది. మారుతి సియాజ్ సెడాన్ ఇప్పుడు పెర్ల్ మెటాలిక్ ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, పెర్ల్ మెటాలిక్ గ్రాండ్యుర్ గ్రే విత్ బ్లాక్ రూఫ్ మరియు డిగ్నిటీ బ్రౌన్ విత్ బ్లాక్ రూఫ్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. దీని మాన్యువల్ వేరియంట్ ధర రూ. 11.14 లక్షలు కాగా, ఆటోమేటిక్ ధర 12.34 లక్షలు (ధరలు, ఎక్స్-షోరూమ్). అప్డేటెడ్ సియాజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ISOFIX చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్ వంటి 20 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి సియాజ్ 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కలిగి 103 బిహెచ్పి పవర్ , 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ & 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. ఫీచర్స్ పరంగా ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కలిగి ఉంది. ఈ సెడాన్ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న నెక్సా షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. -
టాప్ గేర్‌లో మారుతి సియాజ్
న్యూఢిల్లీ: ప్రీమియం సెడాన్ విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) సియాజ్ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో 24,000 కార్ల విక్రయం నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్యాటగిరీలో 28.8 శాతం మార్కెట్ వాటాను కలిగిఉన్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ వెల్లడించారు. 2014లో విడుదలైన సెడాన్.. ఇప్పటివరకు 2.34 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. ఆగస్టులో విడుదలైన వెర్షన్ బుకింగ్స్ 10,000గా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. -
అమ్మకాల్లో మారుతీ సియాజ్ అదుర్స్
న్యూఢిల్లీ : ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి మిడ్ సైజ్ ప్రీమియం సెడాన్ సియాజ్, దేశీయ మార్కెట్లో దూసుకెళ్తోంది. లక్ష క్యూములేటివ్ అమ్మకాల మైలురాయిని జూన్ లో చేధించినట్టు మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. ఈ కారును ఆవిష్కరించిన రెండేళ్లలో ఈ మైలురాయిని తాకినట్టు కంపెనీ తెలిపింది. 2014 అక్టోబర్ లో ఈ కారును దేశవ్యాప్తంగా విడుదలచేశారు. అప్పటినుంచి 2016 జూన్ వరకు 1,00,272 యూనిట్ల సియాజ్ మోడల్ అమ్ముడుపోయినట్టు మారుతీ సుజుకి ఇండియా(ఎమ్ఎస్ఐ) ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఏ3 ప్లస్ సెగ్మెట్ లో అత్యధికంగా అమ్మకాలు నమోదవుతున్న సెడాన్ గా సియాజ్ ఉందని ఎమ్ఎస్ఐ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఎస్ కల్సి చెప్పారు. ప్రీమియం సెడాన్ రంగంలో 40శాతం మార్కెట్ షేరును సొంతంచేసుకున్నట్టు వెల్లడించారు. 2016లో మొదటి ఐదు నెలల్లో.. సగటు నెల అమ్మకాలు 5వేల యూనిట్లకు పైగా నమోదయ్యాయని ఎమ్ఎస్ఐ తెలిపింది. ఈ కారులో వాడిన ఎస్ హెచ్ వీఎస్ లాంటి టెక్నాలజీ ఆవిష్కరణలు కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని కల్సి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ఎస్ హెచ్ వీఎస్ ఆప్షన్లలో సియాజ్ మార్కెట్లో అందుబాటులో ఉంది. గంటకు 28.09కిలోమీటర్ ఫ్యూయల్ ఎకనామీని సియాజ్ అందిస్తోంది. రూ.7.53 లక్షల నుంచి రూ.9.94లక్షల (ఎక్స్ షోరూం ఢిల్లీ) మధ్య ఈ మోడల్ ధరలు ఉన్నాయి. ఆఫ్రికా, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియన్, సార్క్ దేశాలకు ఈ మోడల్ ను ఎగుమతి చేస్తున్నారు. 2016 జూన్ చివరి కల్లా 18వేల యూనిట్లు ఎగుమతులు నమోదయ్యాయి. -
మారుతీ సియాజ్ ఇదిగో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి మిడ్ సైజ్ ప్రీమియం సెడాన్ సియాజ్‌ను దేశవ్యాప్తంగా సోమవారం విడుదల చేసింది. డీజిల్, పెట్రోల్ వర్షన్లలో లభించే ఈ కారు ధర వేరియంట్‌నుబట్టి హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో రూ.7.34-10.2 లక్షల మధ్య ఉంది. ఏ3+ విభాగంలో అధిక పొడవు, వెడల్పు ఉన్న మోడల్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, విశాలమైన లెగ్ రూమ్, భద్రత కోసం సుజుకీ టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీని వాడారు. మైలేజీ డీజిల్ వేరియంట్ 26.21, పెట్రోల్ అయితే 20.73 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. సియాజ్ అభివృద్ధికి రూ.620 కోట్లు ఖర్చు చేశారు. వెయిటింగ్ పీరియడ్ 8-10 వారాలు ఉంది. 15 లక్షల కస్టమర్లు.. స్విఫ్ట్, డిజైర్ కస్టమర్లు 15 లక్షల మంది వరకు అప్‌గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తున్నారని మారుతి సుజుకి డీలర్ డెవలప్మెంట్, సేల్స్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ పార్థో బెనర్జీ సోమవారమిక్కడ తెలిపారు. సియాజ్ విడుదల కార్యక్రమంలో కంపెనీ ప్రాంతీయ మేనేజర్ మునీష్ బాలితో కలిసి మీడియాతో మాట్లాడారు. పాత కస్టమర్ల ఆశలను సియాజ్ తీరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా సియాజ్ బుకింగ్స్ నమోదయ్యాయని చెప్పారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నుంచి ఈ సంఖ్య 800పైగా ఉంది. ఎస్ఎక్స్4 మోడల్ ఉత్పత్తి నిలిపివేసినట్టు కంపెనీ తెలిపింది. ఆరేడేళ్ల తర్వాతే: కొద్ది కాలం క్రితం వరకు కస్టమర్లు నాలుగైదేళ్లకోసారి కారును మార్చేవారు. ఇప్పుడు ఆరేడేళ్లు అట్టిపెట్టుకుంటున్నారని పార్థో బెనర్జీ తెలిపారు. ఎకానమీ ఇంకా వృద్ధిబాటన పట్టలేదు. సెంటిమెంటూ బలహీనంగా ఉంది. కార్ల పరిశ్రమ మందగమనానికి కారణమిదే అని చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గితే పరిశ్రమకు మేలు జరుగుతుందని అన్నారు. ఎంక్వైరీలు పెరుగుతున్నందున పండుగల సీజన్లో అమ్మకాల జోష్ ఉంటుందని పేర్కొన్నారు. 2014-15 తొలి అర్ధ భాగంలో కంపెనీ 15 శాతం వృద్ధి నమోదు చేసింది. రెండో అర్ధభాగంలోనూ అంతే వృద్ధిని ఆశిస్తోంది. నెలకు 10 కార్ల విక్రయాలు నమోదయ్యే అవకాశమున్న చిన్న పట్టణాల్లో కంపెనీ షోరూంలను తెరుస్తోంది.