కార్ల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచనున్నామని కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. మరికొన్ని ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఆర్థిక, మార్కెట్ పరిస్థితులు, ముడి పదార్ధాల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం, రూపాయి మారకంలో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం ఇత్యాది కారణాల వల్ల మెర్సిడెస్, బీఎండబ్ల్యూ ఆడి వంటి లగ్జరీ కార్ల కంపెనీలే కాకుండా మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా కంపెనీలు ధరల పెంపునకు రంగం సిద్ధం చేశాయి.
భారమైన వ్యయాలు
భరించలేనంతగా ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయని, అందుకే ధరలు పెంచక తప్పడం లేదని మారుతీ సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) సీవోవో(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయంక్ పరీక్ చెప్పారు. మారుతీ సుజుకి కంపెనీ రూ.2.13 లక్షల ఖరీదుండే ఎం800 కారు నుంచి రూ.24.6 లక్షల ఖరీదుండే గ్రాండ్ విటారా వరకూ వివిధ కార్ల మోడళ్లను విక్రయిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో రూపాయి ఒడిదుడుకుల కారణంగా రూ.10,000 వరకూ వివిధ మోడళ్ల కార్ల ధరలను ఈ కంపెనీ పెంచింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు తట్టుకోవడానికి వచ్చే నెల నుంచి ధరలను పెంచాలని యోచిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డివిజన్ హెడ్(మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగా ధరలను పెంచక తప్పడం లేదని ఆయన వివరించారు. ఈ కంపెనీ రూ.2.89 లక్షల నుంచి రూ.26.69 లక్షల రేంజ్‌లో వివిధ కార్ల మోడళ్లను విక్రయిస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచి తమ కార్ల ధరలను పెంచాలనుకుంటున్నామని హోండా కార్స్ ఇండియా కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు. ద్రవ్యోల్బణం, కరెన్సీ ఒడిదుడుకుల ప్రభావాలను కొంతైనా తట్టుకునేందుకు ధరలు పెంచాలని యోచిస్తున్నామని, ఏ మేరకు ధరలు పెంచాలనే విషయమై కసరత్తు చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఈ కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ.2,000-రూ.10,000 రేంజ్‌లో పెంచింది.
లగ్జరీ కార్లదీ అదే బాట
లగ్జరీ కార్ల కంపెనీలు కూడా ధరల పెంపు బాట పట్టాయి. అన్ని రకాల మోడళ్ల ధరలను 10 శాతం వరకూ పెంచనున్నామని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తాజాగా పేర్కొంది. అయితే, ఈ కంపెనీ ధరల పెంపునకు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. ఈ సంస్థ రూ.22 లక్షల నుంచి రూ.3 కోట్ల ధరల రేంజ్‌లో లగ్జరీ కార్లను విక్రయిస్తోంది. ఆర్థిక సంబంధిత కారణాల వల్ల తమ వ్యాపారంపై ఒత్తిడి తీవ్రంగా ఉందని, అందుకే జనవరి నుంచి కార్ల ధరలను 3 నుంచి 5 శాతం వరకూ పెంచుతున్నామని ఆడి ఇండియా హెడ్ జోయ్ కింగ్ తెలిపారు. ఈ కంపెనీ విభిన్న కార్ల మోడళ్ల(ఏ4, ఎస్4, ఏ6, ఎస్6, ఏ8 సెడాన్) ను, క్యూ3, క్యూ5, క్యూ7 ఎస్‌యూవీలను, ఆర్8, వీ8, ఆర్8 స్పైడర్ వంటి స్పోర్ట్స్ కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.27.93 లక్షల నుంచి రూ.2.14 కోట్ల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.
బీఎండబ్ల్యూ పెంపు 10 శాతం
కార్ల ధరలను 10% వరకూ పెంచుతామని బీఎండబ్ల్యూ ప్రకటించింది. డాలరుతో రూపాయి విలువ పతనం కారణంగా ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ కార్ల ధరలను 5% వరకూ పెంచింది. ప్రస్తు తం ఈ సంస్థ భారత్‌లో 1 సిరీస్, 3,5,6,7 సిరీస్ కార్లను, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5 ఎస్‌యూవీలను, ఎం సిరీస్ స్పోర్ట్స్ కార్లను, మినీ సిరీస్ కార్లను విక్రయిస్తోంది. ఈ కార్ల ధరలు రూ.20.9 లక్షల నుంచి రూ.1.78 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి.