ఎంబీబీఎస్‌కు దరఖాస్తులు 3,000
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- 18 వరకు గడువు.. 20న ప్రొవిజనల్ మెరిట్ జాబితా
సాక్షి, హైదరాబాద్
2017–18 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. తొలి రెండు రోజుల్లో 3 వేల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఉత్తీర్ణత ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం సీట్లకు, ప్రైవేటు వైద్య కాలేజీల్లో 50 శాతం సీట్ల భర్తీకి కాళోజీ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నిర్వహిస్తోంది.
జూలై 18 సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. జూలై 20న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచనుంది. అనంతరం విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. ఈ జాబితా ఆధారంగా అభ్యర్థులు కాలేజీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం కాళోజీ విశ్వవిద్యాలయం http://medadm.tsche.in వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచింది. ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 వెర్షన్ మాత్రమే ఉపయోగించి దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఆధార్ తప్పనిసరి..
ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల ఆన్‌లైన్ దరఖాస్తులో రిజిస్ట్రేషన్/వెరిఫికేషన్ రుసుము కింద ఓïసీ, బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.2,500లను, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల్లో ఏదో ఒక పద్ధతిలో చెల్లించాలని నోటిఫికేషన్‌లో సూచించారు. దరఖాస్తు సమయంలో విద్యార్థులు నీట్ అడ్మిట్ కార్డు, ర్యాంకు కార్డు, పదో తరగతి లేదా సమానమైన విద్యార్హతల సర్టిఫికెట్‌లో ఉండే పుట్టిన తేదీ వివరాలను, ఇంటర్మీడియట్, తత్సమానమైన విద్యార్హతను ధ్రువీకరించే మార్కుల మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీసర్టిఫికెట్లు, కేటగిరీ సర్టిఫికెట్, ఆధార్ కార్డులను తప్పనిసరిగా దగ్గర ఉంచుకుని వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు.