మీరాకుమార్ లేదా షిండే!
♦ బీజేపీ దళిత బాణానికి విపక్ష సమాధానం
♦ రేపు ప్రతిపక్షాల భేటీలో ఉమ్మడి అభ్యర్థిపై నిర్ణయంస
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత అభ్యర్థి ప్రకటనతో బీజేపీ విసిరిన సవాలుకు అదే రూట్లో సమాధానమిచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అందుకోసం దళిత అభ్యర్థినే రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండేల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరూ దళిత నేతలే కావడంతో... కోవింద్‌కు మద్దతు ప్రకటించిన కొన్ని ప్రతిపక్షాల్ని తమ వైపు తిప్పుకునేలా ఈ ఎత్తుగడను అనుసరిస్తున్నట్లు సమాచారం.
బిహార్‌కు చెందిన మీరాకుమార్ మాజీ ఉపప్రధాని, ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు బాబూ జగ్జీవన్‌రామ్ కుమార్తె. ఆమెను బరిలో దింపితే... బిహార్ సీఎం నితీష్ కుమార్ తప్పకుండా మద్దతిస్తారనేది కాంగ్రెస్ అంచనా.. మాయావతి కూడా మీరాకుమార్‌కు మద్దతిచ్చే వీలుంటుంది. అయితే ఆమె ఎంపిక విషయంలో కొన్ని ప్రతికూలతలున్నాయి. 2014లో లోక్‌సభ స్పీకర్‌గా వైదొలిగాక కూడా అధికార నివాసాన్ని మీరాకుమార్ ఖాళీచేయకపోవడం వివాదా స్పదమైంది. ఆమె ఆస్తులకు సంబంధించి కొన్ని ఆరోపణలు విన్పించాయి. స్పీకర్‌గా మీరాకుమార్ పనితీరు అంతగా ఆకట్టుకోలేదన్న ప్రచారం కూడా ఉంది.
ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ఆమెను అభ్యర్థిగా నిలబడితే నితీష్ మద్దతు కూడగట్టడం సులభమవుతుందనేది వ్యూహంలా కన్పిస్తోంది. మరోవైపు షిండేను అభ్యర్థిగా నిర్ణయిస్తే.. 2007లో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు మళ్లీ పునరావృతమయ్యే అవకాశముంది. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్‌ను అభ్యర్థిగా నిలపడంతో ఆమెకు శివసేన మద్దతివ్వక తప్పని పరిస్థితి.. అదే ఎత్తుగడను ఇప్పుడు కూడా అనుసరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. షిండేకు కూడా మాయావతితో పాటు మరికొన్ని పార్టీలు తప్పకుండా మద్దతిస్తాయనేది అంచనా..
గురువారం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల భేటీలో ఉమ్మడి అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు. బీజేపీ ప్రయోగించిన దళిత కార్డుకు అదే స్థాయిలో సమాధానమిచ్చేలా అభ్యర్థి ఎంపికపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అదే సమయంలో అభ్యర్థి ఎంపిక విషయంలో విభేదాలు తలెత్తకుండా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండేలా చూడటం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యం. 2019 పార్లమెంట్ ఎన్నికల వరకూ ప్రతిపక్షాల మధ్య ఐక్యత కొనసాగాలనేది ఆ పార్టీ ఆలోచన.. ఈ రెండింటి ప్రాతిపదికగా భేటీలో మీరాకుమార్, షిండేల పేర్లపై చర్చించవచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం.