
జైల్లోనే మెమన్ అంత్యక్రియలు!
మెమెన్ మృతదేహాన్ని మహారాష్ట్రలోని నాగ్పూర్ సెంట్రల్ జైల్ కంప్లెక్స్ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో ఉరిశిక్షకు గురైన యాకూబ్ మెమన్ మృతదేహానికి ఆ జైలు ఆవరణలోనే అంత్యక్రియలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు కాంప్లెక్స్ ప్రాంగణంలో మెమన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 1993 మార్చి 12న ముంబై 13 వేర్వేరు చోట్ల వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ను గురువారం ఉదయం 6:40 గంటలకు ఉరి తీసిన సంగతి తెలిసిందే.
అయితే మెమన్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించాలనే డిమాండ్ను జైలు అధికారులు తిరస్కరించారు. శవపరీక్ష నివేదిక అందిన అనంతరం మెమన్ను జైలు ప్రాంగణంలోనే ఖననం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ముంబయిలోని మెమన్ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.