ఐటీ ఇంజనీర్ దుండగులను ఎదిరించినా..
ఆమె ఎక్కడో రాజస్థాన్ నుంచి గుర్‌గ్రామ్ వచ్చి ఉద్యోగం చేసుకుంటోంది. ఎప్పటిలాగే సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకోడానికి ఫోన్ సిగ్నల్ కోసం అటూ ఇటూ తిరుగుతుండగా.. ఒక ఎస్‌యూవీలో వచ్చిన కొందరు దుండగులు ఆమెను లోపలకు లాగేయబోయారు. అయితే ఆమె దాన్ని గట్టిగా ప్రతిఘటించి, కేకలు పెట్టినా చుట్టుపక్కల వాళ్లు వినోదం చూస్తూ ఉండిపోయారు తప్ప ఏ ఒక్కరూ ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదు. ఈ ఘటన గుర్‌గ్రామ్‌లోని ఇఫ్కో చౌక్‌లో రాత్రి 7 గంటల సమయంలో జరిగింది.
బాధితురాలు (26) సైబర్‌సిటీలోని ఒక ఐటీ సంస్థలో కన్సల్టెంటుగా పనిచేస్తోంది. అప్పుడే జైపూర్ నుంచి వోల్వో బస్సులో దిగింది. క్యాబ్ బుక్ చేసుకుందామని ఫోన్ తీస్తే సిగ్నల్ సరిగా లేదు. దాంతో దగ్గర్లో ఉన్న బస్టాపు వద్దకు వెళ్లింది. ఆ సమయానికి అంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తుంటారు. బాగా బిజీగా కూడా ఉంది. అయినా ఒక స్కార్పియోలో వచ్చిన కొందరు వ్యక్తులు ఆమెను చెయ్యిపట్టి లోపలకు లాగేయబోయారు. వాళ్లను గట్టిగా ప్రతిఘటిస్తూ, కేకలు కూడా పెట్టింది. ఎవరూ రాకపోయినా ధైర్యం కోల్పోక తానే అక్కడి నుంచి తప్పించుకుంది. తన కాలును కారు తలుపు మీద ఆనించి గట్టిగా వెనక్కి లాక్కుంది. అంతసేపూ అరుస్తూనే ఉంది. ఇంతలో సిగ్నల్ పడటంతో వాళ్లు ఆమెను రోడ్డు మీదకు తోసేసి, అక్కడి నుంచి పారిపోయారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఆమె ఫేస్‌బుక్‌లో వివరంగా పోస్ట్ పెట్టింది. తాను ఎంత అరిచినా కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాలేదని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని తొలుత అనుకున్నా, తర్వాత మళ్లీ తల్లిదండ్రులకు తెలిస్తే ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేయమంటారని ఊరుకుంది. జరిగిన ఘటనను తలుచుకుని ప్రతిరోజూ ఏడుస్తూనే ఉన్నట్లు చెప్పింది. ఏం జరిగిందో అర్థం చేసుకోడానికి కొంతసేపు పట్టిందని, తర్వాత ఎక్కువ మంది మహిళలు ఉన్నచోటుకు వెళ్లానని వివరించింది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేద్దామని అనుకున్నా, కారు నెంబరు తదితర వివరాలు చూడలేదని, దాంతో ఊరుకున్నానని చెప్పింది.