మరో ఆప్ నేత అరెస్ట్
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో నేతను అరెస్ట్ చేశారు. దళిత మైనర్ బాలికపై లైంగికదాడి యత్నం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న పంజాబ్కు చెందిన ఆప్ విద్యార్థి విభాగం నాయకుడు హర్దీప్ సింగ్ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న హర్దీప్ను ఈ రోజు సంగ్రుర్ జిల్లా ధిండ్సా గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.
ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హర్దీప్ సన్నిహితుడుగా భావిస్తున్నారు. ఓ ఫొటో స్టూడియో నడుపుతున్న హర్దీప్ వద్దకు ఫొటో తీయించుకునేందుకు వెళ్లగా, తనపై దారుణానికి ప్రయత్నించినట్టు బాధిత బాలిక ఆరోపించింది. కాగా రాజకీయ కుట్రతోనే తనను కేసులో ఇరికించారని హర్దీప్ అన్నాడు.
ఆప్ నాయకులపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రేప్ కేసులో ఢిల్లీ ఆప్ నేత సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకుని, పార్టీ నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు అరెస్ట్ కాగా, మరో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆప్ టికెట్ పొందిన దేవ్ మనే అనే నాయకుడు తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించింది.