శ్రీమంతుల్లో 39 మంది హైదరాబాదీలు | Miami among top global cities for the ultra-wealthy to work and play | Sakshi
Sakshi News home page

శ్రీమంతుల్లో 39 మంది హైదరాబాదీలు

Published Fri, Mar 20 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

శ్రీమంతుల్లో 39 మంది హైదరాబాదీలు

శ్రీమంతుల్లో 39 మంది హైదరాబాదీలు

 వీళ్లు ...చాలా రిచ్
 కనీసం రూ.180 కోట్లున్న శ్రీమంతుల్లో 39 మంది హైదరాబాదీలు
     వీళ్ల పెట్టుబడి 47 శాతం రియల్టీలో;
     అది కూడా విదేశాల్లో
     ఏటా 12 నుంచి 14 శాతం పెరుగుతున్న అపర  కుబేరులు
     నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ వెల్లడి

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ‘అతి భారీ సంపన్నుల’ సంఖ్య భారీగా పెరుగుతోంది. మామూలుగా అధిక సంపద ఉన్నవారిని హైనెట్‌వర్త్ ఇండివిడ్యుజల్స్‌గా (హెచ్‌ఎన్‌ఐ) వ్యవహరిస్తుండగా... ఈ అతి భారీ సంపన్నులను మాత్రం అల్ట్రా హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్‌గా వ్యవహరిస్తున్నారు. దేశంలో రానురాను ఈ తరహా సంపన్నుల సంఖ్య బీభత్సంగా పెరిగిపోతోందని, ఏటా 60 శాతం వృద్ధితో వీరి సంఖ్య ఇపుడు దేశంలో 1,652కు చేరిందని అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్ తెలియజేసింది. వీరంతా ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడులు పెట్టినట్లు ‘నైట్‌ఫ్రాంక్ వెల్త్-2015’ నివేదికలో తెలియజేసింది. ఇంకా ఈ నివేదికలో ఏ అంశాలు వెల్లడించిందంటే..
 
 2005-15 మధ్య... అంటే పదేళ్లలో భారతీయ అతిభారీ సంపన్నులు 166 శాతం వృద్ధి రేటుతో... 50 శాతం పెట్టుబడులను విదేశాల్లో, అదికూడా స్థిరాస్తుల్లోనే పెట్టారు. వీరిలో 23 శాతం మంది సొంత అవసరాల కోసం స్థిరాస్తులను కొంటే, 77 శాతం మంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మాత్రమే స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టారు. విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నవారిలో 42 శాతం మంది ఆస్ట్రేలియాకు చెందినవారు కాగా... రష్యా మూడో స్థానంలో నిలుస్తోంది.
 
 రియల్ ఎస్టేట్‌లో ఈ అల్ట్రా శ్రీమంతుల పెట్టుబడులు ఏటా 2%
 చొప్పున పెరుగుతున్నాయి. దేశీ శ్రీమంతులు తమ ఆదాయంలోని 50 శాతం పెట్టుబడులను స్థిరాస్తి రంగంలో పెడుతుండగా... 33.1 శాతం మంది ఈక్విటీల్లో... 20.4 శాతం మంది డెట్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. స్థిరాస్తి రంగంలో న్యూయార్క్‌లోనే వీరి పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. 2013-14 డిసెంబర్ మధ్య 18.8 శాతం మేర పెరగ్గా... కొలరాడో, బాలి, ఇస్తాంబుల్, అబుదాబిల్లో 14.7 శాతం నుంచి 16 శాతం మేర పెరిగాయి.
 
 ఏటా శాన్‌ఫ్రాన్సిస్కో, డబ్లిన్, కేప్‌టౌన్, మస్కట్, లాస్‌ఏంజెలిస్‌లో 18 శాతం మేర రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,72,850 అల్ట్రా శ్రీమంతులుండగా వీరిలో 1,652 మంది భారతీయులు. ఇంకా చెప్పాలంటే 39 మంది మన హైదరాబాదీలు. 2004లో ఇండియాలో 622 మంది అల్ట్రా శ్రీమంతులుండగా ఈ పదేళ్లలో వారి సంఖ్య 1,652కు చేరింది. 2024 నాటికి దేశంలో వీరి సంఖ్య 3,371కి పెరుగుతుందని నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది.

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ అల్ట్రా శ్రీమంతుల సంపద మొత్తం 20.8 లక్షల కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో 1,309 లక్షల కోట్లన్న మాట. అయితే వీరి పెట్టుబడులు ఎక్కువగా కేంద్రీకృత మయింది మాత్రం లండన్‌లోనే. ఆసియా దేశాల్లో అయితే హాంగ్‌కాంగ్‌లోఎక్కువగా ఉన్నారు. ప్రత్యేకించి ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లోని అల్ట్రా శ్రీమంతులు ఎక్కువగా అమెరికా, యూరప్‌లలోని స్థిరాస్తులను కొనుగోలు చేశారు.
 
 హైదరాబాద్‌లోనూ అల్ట్రా శ్రీమంతులు!
 ఇదిలా ఉంటే ఈ అల్ట్రా హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ భాగ్యనగరంలోనూ ఉన్నారండోయ్. 2014 నాటికి 619 యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలతో ముంబై మొదటి స్థానంలో నిలవగా.. 39 మందితో హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. వచ్చే పదేళ్లలో అంటే.. 2024 నాటికి వీరి సంఖ్య 136 శాతం పెరిగి దాదాపు 92కి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. ఏడాదికి వీరి సంఖ్య దాదాపు 12 నుంచి 14 శాతం మధ్య పెరగవచ్చని నివేదిక పేర్కొంది. నగరాల వారీగా యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ పట్టిక ఇదిగో..
 
 ఎవరీ అల్ట్రా శ్రీమంతులు...?
   అల్ట్రా హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ అంటే... ఒక వ్యక్తికి స్వదేశంతో పాటు విదేశాల్లోనూ వ్యక్తిగత స్థిరాస్తులుండాలి. ఆ ఆస్తి విలువ ప్రారంభ ధర 30 మిలియన్ డాలర్లు... అంటే రూ. 180 కోట్లుండాలి. హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ అంటే... సదరు వ్యక్తి ఆస్తి విలువ కనీసం మిలియన్ డాలర్లు... అంటే మన కరెన్సీలో రూ. 6 కోట్లు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement