సామాన్యులకూ టెక్నాలజీ ఫలాలు అందాలి | Microsoft CEO Satya Nadella launches Project Sangam to help low-skill job seekers | Sakshi
Sakshi News home page

సామాన్యులకూ టెక్నాలజీ ఫలాలు అందాలి

Published Thu, Feb 23 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

సామాన్యులకూ టెక్నాలజీ ఫలాలు అందాలి

సామాన్యులకూ టెక్నాలజీ ఫలాలు అందాలి

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల
ఉద్యోగార్థుల కోసం ప్రాజెక్ట్‌ 'సంగం'
స్కైప్‌ లైట్‌ వెర్షన్‌ ఆవిష్కరణ


ముంబై: డిజిటల్‌ టెక్నాలజీలు కేవలం పెద్ద వ్యాపార సంస్థలకే పరిమితం కాకుండా సామాన్యులకు సాధికారత చేకూర్చేందుకు తోడ్పడాలని టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ళ అభిప్రాయపడ్డారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించగలదన్నారు. ‘మనం టెక్నాలజీ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ప్రతి భారతీయుడికి సాధికారత చేకూర్చలేనప్పుడు.. ప్రతి భారతీయ సంస్థ మరింత గొప్ప లక్ష్యాలు సాధించడానికి అది ఉపయోగపడనప్పుడు టెక్నాలజీ వల్ల మనకు ఒరిగిందేమీ ఉండదు‘ అని సత్య వ్యాఖ్యానించారు. కంపెనీ నిర్వహించిన ఫ్యూచర్‌ డీకోడెడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సత్య ఈ విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు.

భారత్‌లో అవసరాలకు అనుగుణంగా వీడియో ఇంటరాక్షన్‌ అప్లికేషన్‌ స్కైప్‌లో లైట్‌ వెర్షన్‌ వీటిలో ఒకటి. తక్కువ బ్యాండ్‌విడ్త్‌లో ఆడియో, వీడియో కాలింగ్, మెసేజీలకు ఉపయోగపడే స్కైప్‌ లైట్‌ వెర్షన్‌ .. ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో పనిచేస్తుందని సత్య వివరించారు. తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషలను ఇది సపోర్ట్‌ చేస్తుంది. అటు, ఆధార్‌ ఆధారిత స్కైప్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు మరో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సత్య చెప్పారు. దీనితో బ్యాంక్‌ ఖాతాలు మొదలుకుని రేషన్‌ షాప్‌లో సరుకులు తీసుకోవడం దాకా అన్ని పనులను సులభతరంగా నిర్వహించుకునేందుకు సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ తరహాలోనే ప్రభుత్వాలు, ప్రభుత్వ.. ప్రైవేట్‌ రంగ సంస్థలు, స్టార్టప్‌లు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

సెమీ స్కిల్డ్‌ వర్కర్లకు తోడ్పాటు..
తమ ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ లింక్డ్‌ఇన్‌ ఆధారంగా ఉద్యోగార్థుల కోసం ’సంగం’ ప్లాట్‌ఫాంను సత్య ఆవిష్కరించారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్స్‌కే పరిమితమైన లింక్డ్‌ఇన్‌ను మధ్య, కనిష్ట స్థాయి నైపుణ్యాలున్న వర్కర్లకు కూడా అందుబాటులోకి తెస్తున్నామని సత్య చెప్పారు. కొత్త ఉద్యోగాలకు అనుగుణంగా సెమీ–స్కిల్డ్‌ వర్కర్లు వొకేషనల్‌ ట్రెయినింగ్‌ పొందేందుకు, ఉద్యోగావకాశాలు దక్కించుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన వివరించారు. ఆతిథ్య రంగం మొదలైన పరిశ్రమలకు దీని వల్ల ప్రయోజనం చేకూరగలదన్నారు. ప్రస్తుతానికి ఇది ప్రివ్యూ దశలోనే ఉందని, త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేగలమని సత్య చెప్పారు.

భారత్‌లో సరైన ఉద్యోగం దొరకపుచ్చుకోవడం గ్రాడ్యుయేట్స్‌కు పెద్ద సవాలుగా ఉంటోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో లింక్డ్‌ఇన్‌లో ’ప్లేస్‌మెంట్స్‌’  పేరిట కొత్తగా మరో సర్వీసును అందుబాటులోకి తెస్తున్నట్లు సత్య వివరించారు. దేశీయంగా కాలేజీ గ్రాడ్యుయేట్స్‌ తమ నైపుణ్యాలకు తగ్గట్లుగా తగిన ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. లింక్డ్‌ఇన్‌కి భారత్‌లో దాదాపు 3.9 కోట్ల మంది సభ్యులు ఉన్నారని, దీని లైట్‌ వెర్షన్‌ 2జీ స్పీడ్‌లో కూడా పనిచేస్తుందని సత్య చెప్పారు.

వలసవాదుల దేశం.. అమెరికా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇమిగ్రేషన్‌ విధానాలపై స్పందిస్తూ.. అమెరికా అంటేనే వలసవాదుల దేశంగా సత్య అభివర్ణించారు. భిన్నత్వానికి అమెరికా ప్రతీకగా నిలుస్తుందని, అత్యుత్తమమైన ఆ దేశ వలసచట్టాలతో ప్రయోజనం పొందినవారిలో తాను కూడా ఒకర్నని ఆయన పేర్కొన్నారు. అయితే ఉద్యోగాల కల్పన విషయానికొస్తే.. భారత్‌లో భారతీయులకే తొలి ప్రాధాన్యం దక్కాలని, అలాగే అమెరికాలోనూ అదే విధానం ఉండాలని సత్య అభిప్రాయపడ్డారు.

తమ కార్యకలాపాలు ఉన్న ప్రతీ దేశంలో ఆర్థిక వృద్ధి అవకాశాలు కల్పించాలన్నదే మైక్రోసాఫ్ట్‌ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ఉదాహరణకు నేనిప్పుడు భారత్‌కి వచ్చినప్పుడు భారత ప్రయోజనాల గురించి మాట్లాడగలగాలి. భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా మేం ఏం చేయగలిగామన్నది చెప్పగలిగి ఉండాలి. అదే విధంగా అమెరికాలో అమెరికాకు తొలి ప్రాధాన్యమివ్వాలి.. బ్రిటన్‌ వెడితే బ్రిటన్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి‘ అని సత్య పేర్కొన్నారు. భేదం చూపించకుండా అందరికీ సమానఅవకాశాలు కల్పించడం వంటి అమెరికా విలువలను కాపాడటానికి కూడా మైక్రోసాఫ్ట్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement