అట్టహాసంగా జీఎస్టీ అమలు
♦ జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్‌హాల్లో ప్రత్యేక కార్యక్రమం
♦ రాష్ట్రపతి, మాజీ ప్రధానులు, అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జీఎస్టీ చట్టం అమలును అందరికీ గుర్తుండేలా అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ. 130 లక్షల కోట్లుగా ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖల్ని మార్చేసే ఈ కొత్త పన్ను వ్యవస్థ ప్రారంభోత్సవం కోసం పార్లమెంట్ సెంట్రల్ హాలును వేదికగా ఎంచుకుంది. జీఎస్టీ అమల్లోకి రానున్న జూన్ 30 అర్ధరాత్రి సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినవేళ 1947, ఆగస్టు 15 అర్ధరాత్రి ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ పేరిట సెంట్రల్ హాల్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసేలా ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
జూన్ 30 రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం.. అర్ధరాత్రి జీఎస్టీ అమల్లోకి వచ్చే వరకూ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 12 గంటలు కాగానే పెద్ద గంటను మోగించి జీఎస్టీ అమలును ప్రకటిస్తారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా ఆహ్వానించినట్లు సమాచారం. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడలు సెంట్రల్‌హాలు కార్యక్రమానికి హాజరుకానున్నారు. జీఎస్టీ పన్ను వ్యవస్థలో రాష్ట్రాలదే కీలకపాత్ర కావడంతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు వెళ్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జీఎస్టీ ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్
జీఎస్టీ ప్రచార కర్తగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే 40 సెకన్ల్ల నిడివున్న వీడియోను కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) అమితాబ్‌పై చిత్రీకరించి ప్రసారం ప్రారంభించింది. ‘జీఎస్టీ– ఏకీకృత జాతీయ విపణి ఏర్పాటు కోసం తొలి అడుగు’ పేరిట ప్రసారమయ్యే ఈ వీడియోను ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. ఇంతకుముందు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జీఎస్టీ అంబాసిడర్‌గా పనిచేశారు.