జమ్ము కశ్మీర్లోని సోపియన్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రత దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి.
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని సోపియన్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రత దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ జవాన్ గాయపడ్డాడు. క్షతగాత్రుడైన జవాన్ను వెంటనే ఆస్పత్రికి తరలించామని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని భావిస్తున్నారు. పోలీసులతో కలసి సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టింది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడి అనంతరం పోలీసులు, సైన్యం కలసి ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.