ఒంటరవుతున్న అచ్చెన్న | Minister K Atchannaidu alone in tdp in srikakulam district | Sakshi
Sakshi News home page

ఒంటరవుతున్న అచ్చెన్న

Published Sat, Oct 17 2015 6:36 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

ఒంటరవుతున్న అచ్చెన్న

ఒంటరవుతున్న అచ్చెన్న

కళా చుట్టూ నేతల ప్రదక్షిణ
సమాచారం వెళ్ళినా మంత్రి మౌనం
 
శ్రీకాకుళం : జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఒంటరవుతున్నారు. ఏడాదిన్నరపాటు జిల్లాలో హవా కొనసాగించిన ఆయన ఇపుడిపుడే కార్యకర్తల నుంచి దూరం అవుతున్నారు. కొన్నాళ్ళుగా అమరావతి శంకుస్థాపన పనిలో ఉన్న మంత్రికి ఇక్కడిసమాచారం తెలియడం లేదు. ఫోన్‌లో తాజా పరిస్థితిని నేతలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. మొన్నటి వరకూ వెంట తిరిగి పనులు చేయించుకున్న దిగువశ్రేణి నేతలు కూడా ఇపుడు రూటు మారుస్తున్నారు.

వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు సైతం సొంత పనుల కోసం పక్కచూపులు చూస్తున్నారు. తాజా పరిణామాలతో మంత్రి కుటుంబ సభ్యులు అవాక్కవుతున్నారు. క్యాబినెట్‌లో సీటు పొంది అసెంబ్లీలో నోరుపారేసుకుని, రాష్ట్ర ప్రథమపౌరుడ్ని పరుషజాలంతో మాట్లాడిన మంత్రి పరిస్థితి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది.
 

నిన్న మంత్రి వెంట... నేడు కళా చెంత...
జిల్లాలోని మంత్రి వెంటే తిరిగిన నేతలు సైతం ఇపుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు చుట్టూ తిరుగుతున్నారు. గతంలో కేవలం ఎచ్చెర్ల నియోజకవర్గానికే పరిమితమైన కళాకు ఇపుడు రాష్ట్ర అధ్యక్షునిగా పదవి దక్కడంతో పనుల కోసం ఆయన వెంట ప్రదక్షిణలు చేస్తున్నారు. పాలకొండ కోటదుర్గమ్మ దర్శనానికి వెళ్ళిన కళా చుట్టూ అక్కడి కాపునేతలంతా చేరిపోయారు.
 
తాజాగా శుక్రవారం శ్రీకాకుళం పట్టణాధ్యక్షుడు మాదారపు వెంకటేష్ సహా 30మంది ప్రత్యేక వాహనాల్లో రాజాం వెళ్ళి కళాను కలుసుకున్నారు. బుధవారం జరిగిన కళా అభినందన సభను బహిష్కరించిన వీళ్ళంతా నాటి సంఘటనకు కారణాలను వివరించి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకే రాజాం వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా వెళ్ళినవారంతా శ్రీకాకుళం ఎమ్మెల్యే అనుచరులే కావడం విశేషం. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా మంత్రి వెంటే తిరిగిన ఎమ్మెల్యే ఇపుడు రూటు మార్చినట్టు తమ్ముళ్ళే ప్రచారం చేస్తున్నారు.
 
జిల్లా అధిష్టానంపైనా ఫిర్యాదు
ఇదిలా ఉంటే జిల్లా అధిష్టానంపై దిగువశ్రేణి నేతలు కొంతమంది శుక్రవారం కళాకు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. బుధవారం నాటి కార్యక్రమం విఫలమైన నేపధ్యంలో జిల్లా అధ్యక్షురాలు శిరీష, పలాస ఎమ్మెల్యే శివాజీల మొండి వైఖరే కారణమని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడి సన్మాన కార్యక్రమానికి పట్టణాధ్యక్షున్ని వేదికపైకి పిలవాలని కోరితే శివాజీ మాత్రం ఒకరిని పిలిస్తే మండల నాయకులను సైతం పిలవాల్సి వస్తుందని ఘీంకరించారని, జిల్లా అధిష్టానంపై చర్య తీసుకోవాలని కోరినట్టు తెలిసింది.
 
కొన్నాళ్ళుగా శివాజీ పట్ల వ్యతిరేకంగా ఉన్నవారే ఈ చర్యలకు పూనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాదులో కళా ప్రమాణస్వీకారం చేసినపుడు, కళా తొలిసారి జిల్లాకు వచ్చినపుడు కలవని నేతలు ఇన్నాళ్ళ తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి అభినందించడంపైనా చర్చ జరుగుతోంది. ఇదంతా జిల్లా మంత్రిని ఒంటరిని చేసేందుకేనన్న ప్రచారమూ ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement