సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో టిక్కెట్ కోసం సిగపట్లు తారస్థాయికి చేరాయి. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నవారు ఆనందంలో ఉంటే... ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు, కటౌట్లకు భారీగా చేతిచమురు వదిలించుకున్నవారు మాత్రం నైరాశ్యంలో కూరుకుపోయారు. తమకు న్యాయం చేయకపోతే తడాఖా చూపిస్తామని ప్రత్యక్షంగా, పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు కుటుంబానికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. చివరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఇన్నాళ్లూ పనిచేసిన కిమిడి నాగార్జున పేరు తొలి జాబితాలో వెల్లడిగాకపోవడం గమనార్హం. పారాచ్యూట్ నాయకుడు గంటా శ్రీనివాసరావును చీపురుపల్లికి వెళ్లమని అధిష్టానం ఒత్తిడి చేస్తోందని తెలుసుకున్న నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కె.ఎ.నాయుడికి ఎదురుదెబ్బ...
గజపతినగరం నియోజకవర్గం టీడీపీ టిక్కెట్‌ను కొండపల్లి శ్రీనివాస్‌కు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు (కె.ఎ. నాయుడు), ఆయన వర్గం జీర్ణించుకోలేకపోతోంది. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో వారంతా శనివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఇప్పటివరకూ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ కోసం కష్టపడ్డానని, మూడు పార్టీలు మారివచ్చిన కొండపల్లి కొండలరావుకు, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు అధిష్టానం పెద్దపీట వేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తనతో పాటు 500 మంది తన అనుచర గణం పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం గజపతినగరంలో నిరసనకు పిలుపునిచ్చారు. గజపతినగరం టికెట్‌ను ఆశించిన మరో టీడీపీ నాయకుడు కరణం శివరామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ చేసిన ద్రోహానికి కంటతండి పెట్టారు.
‘కళ’ తప్పింది..
ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ టీడీపీ సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు విజయనగరం జిల్లా రాజకీయాలపై గతంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. జిల్లాల పునర్విభజన తర్వాత తన సొంత ప్రాంతమైన రాజాం విజయనగరం జిల్లాలో విలీనమైన దృష్ట్యా ఇక చక్రం తిప్పాలని విశ్వప్రయత్నాలు చేశారు. తీరా టికెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి చెల్లని కాసు అయిపోయారు. ఎచ్చెర్ల టికెట్‌ను మరోసారి ఆశిస్తున్న ఆయన పేరు తొలి జాబితాలో ప్రకటించకపోవడం గమనార్హం.
ఆయన సోదరుడి కుమారుడు, టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడైన కిమిడి నాగార్జున కూడా మరోసారి చీపురుపల్లి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. తొలి జాబితాలో ఆయన పేరు కూడా వెల్లడించలేదు. కిమిడి కళావెంకటరావు కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించినా రాజాం టికెట్‌ను కోండ్రు మురళీమోహన్‌కు చంద్రబాబు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కోండ్రుకు బదులుగా స్వర్ణరాణికి టికెట్ ఇవ్వాలంటూ కిమిడి కుటుంబం, మాజీ ఎంపీపీ కొల్లా అప్పలనాయుడు చేసిన ప్రతిపాదన కూడా గాలికి కొట్టుకుపోయింది. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి, మహానాడులో తొడకొట్టి సవాలు చేసిన ఆమె కుమార్తె గ్రీష్మ పేర్లను చంద్రబాబు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వీరి తీరు ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకం.
నివురుగప్పిన నిప్పులా అసమ్మతి...
బొబ్బిలి టికెట్ దక్కించుకున్న ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) మినహా తొలి జాబితాలో పేరు వెల్లడైన అందరికీ తమ నియోజకవర్గాల్లో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అస్త్ర సన్యాసం చేసి తన కుమార్తె అదితికి విజయనగరం టికెట్ ఇప్పించుకోగలిగారు. ఈ నియోజకవర్గంలో అశోక్ అణచివేసిన బీసీ మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మాత్రం కిమ్మనలేదు. ఆమె అనుచరులు మాత్రం రగిలిపోతున్నారు. పార్వతీపురం టికెట్‌ను ఎన్నారై బోనెల విజయచంద్రకే చంద్రబాబు కేటాయించారు.
దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులకు మొండిచేయి చూపించారు. విజయచంద్రను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాట కూడా చెల్లలేదు. సాలూ రులో భంజ్‌దేవ్ వర్గం ఎంత వ్యతిరేకించినా టికెట్ మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికే దక్కింది. కురుపాంలో ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకించినా తోయక జగదేశ్వరికే టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. వ్యతిరేక వర్గాలు తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థులను డిపాజిట్లుకూడా రాకుండా ఓడిస్తే తప్ప చంద్రబాబుకు బుద్ధిరాందంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
బీసీలకు చంద్రబాబు మోసం...
కేవలం ఓట్ల కోసమే బీసీల జపం చేసే చంద్రబాబు అసలు నైజం బయటపడింది. బీసీల జిల్లాగా పేరొందిన విజయనగరం జిల్లాకు సంబంధించి టీడీపీ–జనసేన కూటమి తరఫున తొలిజాబితాలో టికెట్లు దక్కించుకున్నవారిలో బీసీ అభ్యర్థి ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన రాజాం మినహాయిస్తే మిగిలిన నాలుగు జనరల్ సీట్లలో బీసీలకు ఒక్క సీటు మాత్రమే దక్కింది. విజయనగరం, బొబ్బిలి టికెట్లను రాజులకే (క్షత్రియ సామాజిక వర్గానికి) కేటాయించింది.
ఏకులా వచ్చి మేకు అయ్యింది...
నెల్లిమర్ల ఎమ్మెల్యే నేనే అవుతానంటూ ఇన్నాళ్లూ ఉబలాటపడిన కర్రోతు బంగార్రాజు నెత్తిన పిడుగుపడింది. జనసేన కోటాలో టికెట్ దక్కించుకున్న లోకం మాధవిని తొలుత తక్కువగా అంచనా వేశారు. ఆమె పవన్ కల్యాణ్ మద్దతుతో బరిలోకి దిగేసరికి బంగార్రాజు సహా నెల్లిమర్ల టీడీపీ నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. శనివారం సాయంత్రం విజయనగరంలోని ఒక హోటల్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. బంగార్రాజు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, నెల్లిమర్ల మండల టీడీపీ అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మునాయుడు తదితరులంతా హాజరయ్యారు. మూడ్రోజుల్లో లోకం మాధవిని మార్చకపోతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేయాలని, తాడేపల్లి వెళ్లి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్యాలెస్ వద్ద నిరసన తెలిపివద్దామని నిర్ణయించారు. లోకం మాధవి వర్గం మాత్రం సంతోషంలో ఉంది. అయితే, మాధవి ఎలా గెలుస్తుందో చూస్తామని టీడీపీ వర్గాలు బహిరంగంగానే సవాల్ చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment