
రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొడుతున్నారు
రైతు సమస్యల పరిష్కారం విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో 12 గంటల పాటు రైతు సమస్యలు, ఆత్మహత్యలపై చర్చకు వీలుకల్పించిందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు...
- విపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపాటు
- రైతు సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
- విపక్షాల వాదనలో పసలేదు
- బిహార్‌కు కేంద్రం రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఏ లెక్కన ఇచ్చిందో బీజేపీ నేతలు చెప్పాలి
- ప్రధానికి ఒక్కసారైనా తెలంగాణకు వచ్చే తీరిక లేకుండా పోయింది
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో 12 గంటల పాటు రైతు సమస్యలు, ఆత్మహత్యలపై చర్చకు వీలుకల్పించిందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ విషయంలో తమ సిద్ధాంతాలు పక్కనపెట్టి రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాల వాదనలో పసలేదని, విపక్షనేతలంతా కలసి రాష్ట్ర రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
గురువారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలసి విలేకరులతో మాట్లాడారు. రైతు సమస్యలపై శాసన సభలో విస్తృతంగా చర్చించామని చెప్పారు. రెండు రోజుల్లో పన్నెండు గంటలు చర్చిస్తే అందులో విపక్షాలే ఏకంగా 6.23 గంటల పాటు చర్చలో పాల్గొన్నాయని వివరించారు. కాంగ్రెస్ 2.43 గంటలు, టీడీపీ 1.10 గంటలు, బీజేపీ 1.15 గంటలు, ఎంఐఎం 42 నిమిషాలు, వైఎస్సార్ కాంగ్రెస్ 30 నిమిషాలు, సీపీఐ 26 నిమిషాలు, సీపీఎం 15 నిమిషాల పాటు ఇదే అంశంపై మాట్లాడాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత రెచ్చగొట్టాలని చూసినా తాము ఓపిగ్గా ఉన్నామని, ముఖ్యమంత్రి స్పష్టంగా గంటా 45 నిమిషాల పాటు అన్ని విషయాలూ వివరించారని చెప్పారు.
60ఏళ్ల దరిద్రం 15నెలల్లో పోతుందా..?
రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వ ఆలోచనలు సభలో చెప్పామని, వారసత్వంగా సంక్రమించిన విద్యుత్ సమస్యను నివారించి ఆరుగంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని చెప్పారు. అయినా, అరవై ఏళ్లుగా వచ్చిన దరిద్రం కేవలం పదిహేను నెలల్లో పోతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు నిర్ణయించామని, ప్రతిపక్షాలు అడగకముందే గత ఏడాది జూన్ 2 నుంచి చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని గుర్తు చేశారు.
సభలో తాము విపక్షాలు చెప్పిందంతా విన్నామని, కానీ, ప్రతిపక్షాలకు చర్చ అవసరం లేదని.. వారికి రచ్చ మాత్రమే కావాలని, శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులైనా శాసన సభను నిర్వహిస్తామని, అయితే విపక్షాల వాదనలో పసలేదని, వారిది డొల్ల వాదనని పేర్కొన్నారు. ‘కేంద్రంలోని ప్రభుత్వం బిహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఏ నీతి ఆయోగ్ ప్రతిపాదించిందని ఇచ్చారు..? ఏ మేనిఫెస్టోలో పెట్టారని ఇచ్చారు..? దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి’ అని అన్నారు.
ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీకి ఏమిచ్చినా, తెలంగాణకు కూడా ఇవ్వాల్సిందేనని, పదిహేను నెలల్లో ప్రధానికి ఒక్కసారన్నా తెలంగాణకు వచ్చే ఓపిక, తీరిక లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ‘కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? కాల్లల్లో కట్టెలు ఎందుకు పెడుతున్నారు’ అని ప్రశ్నించారు. అధికారమే పరమావధిగా అన్ని పక్షాలు ఒక్కటవుతున్నాయని, ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, శ్రీనివాస్‌గౌడ్, పుట్టా మధు, రెడ్యానాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.