చంపుతామని ముందే బెదిరించారు: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: తన నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాలను పహిల్వాన్ గ్యాంగ్ ఆక్రమించిందని, దీనిపై స్థానికుల విజ్ఞప్తి మేరకు తాను అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశానని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. తన ఫిర్యాదుపై వారు వెంటనే స్పందించి ఆక్రమించిన స్థలాలను పరిశీలించి అక్కడ నిర్మాణాలు ప్రారంభమైనట్లు గమనించారని చెప్పారు. వారి అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే తనను అంతమొందించాలని ప్రయత్నించారని పేర్కొన్నారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో అక్బరుద్దీన్ బుధవారం రెండోసారి నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలమిచ్చారు.
2009 ఎన్నికల్లో తన ప్రత్యర్థికి మద్దతిచ్చారు
‘2009 ఎన్నికల్లో మహ్మద్ పహిల్వాన్ తన ప్రత్యర్థి ఎంబీటీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచే నామీద కక్ష్య పెంచుకొని చంపుతామని బెదిరించారు. పహిల్వాన్, మునావర్ ఇక్బాల్‌లు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నట్లుగా స్థానికులు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు ఆధారంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులకు వినతిపత్రం ఇచ్చాను. నా ఫిర్యాదుపై హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ స్పందించి ఆక్రమించిన స్థలాలను పరిశీలించి అక్కడ నిర్మాణాలు ప్రారంభమైనట్లు గుర్తించారు.
2011 ఏప్రిల్ 13న గుర్రంచెరువు కట్ట ప్రాంతంలో స్థానిక ఆర్‌ఐతో కలిసి అక్రమ నిర్మాణాలను పరిశీలించి వస్తుండగా యూనుస్ బిన్ ఓమర్ యాఫై ఆయన కుమారుడు ఈసా బిన్ యూనుస్ యాఫైలు నా వాహనాన్ని ఆపారు. నాతో వాగ్వివాదానికి దిగి చంపుతామని బెదిరించారు. పహిల్వాన్ గ్యాంగ్ అక్రమాలను అడ్డుకుంటున్నాననే కక్ష్యతోనే తనను చంపి అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 30, 2011న కత్తులు, తుపాకులు, క్రికెట్ బ్యాట్‌తో నాపై దాడి చేశారు. ఈ దాడిలో అనేకచోట్ల కత్తులతో పొడిచారు. బుల్లెట్ గాయాలయ్యాయి’’ అని అక్బరుద్దీన్ వివరించారు. ఈ సందర్భంగా తనను చంపుతామని బెదిరించిన మునావర్ ఇక్బాల్, యూనుస్ బిన్ ఓమర్ యాఫైలను అక్బరుద్దీన్ గుర్తించారు.
కేర్ ఆసుపత్రిలో 20 రోజులు చికిత్స పొందా...
‘‘దాడి తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాను. ముందుగా తనను ఓవైసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసింది. కేర్ ఆసుపత్రిలో 20 రోజులపాటు చికిత్స పొందాను. కేర్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మూడు శస్త్రచికిత్సలు జరిగాయి. జూలైలో గ్లోబల్ ఆసుపత్రిలో కడుపు భాగంలో, సెప్టెంబర్‌లో ఎడమ చేయి ఎముకను సరిచేసేందుకు శస్త్రచికిత్సలు జరిగాయి. దాడి సమయంలో మూత్రపిండానికి, పెద్దపేగు దెబ్బతిన్నాయి. మూత్రపిండం ఐరన్‌ను తీసుకునే పరిస్థితి లేకపోవడంతో 2012 జనవరిలో స్టంట్ వేశారు’’ అని అక్బరుద్దీన్ వివరించారు. ఇదిలా ఉండగా పహిల్వాన్ సహా ఇతర నిందితుల తరఫు న్యాయవాదులు గురువారం అక్బరుద్దీన్‌ను క్రాస్‌ఎగ్జామినేషన్ చేయనున్నారు.