మోదీ ప్రసంగంలో ఆ 'పదం' ఏమైంది!
ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడు ప్రసంగించినా.. 'మిత్రోం' అని జనాల్ని ఉద్దేశించి సంబోధించడం పరిపాటి. కానీ కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం (డిసెంబర్ 31న) జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. 'మిత్రోం'కు బదులు 'దోస్తోం' అని సంబోధించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పేదలు, మహిళలు, పలువర్గాల వారికి రాయితీలు ప్రకటిస్తూ.. నోట్ల కష్టాలు తొలగిపోతాయని హామీ ఇస్తూ మోదీ ప్రసంగం సాగినప్పటికీ.. ట్వీపుల్ (ట్విట్టర్ జనం) మాత్రం 'మిత్రోం' ఏమైందంటూ ఆరా తీశారు. మోదీ ప్రసంగంలో 'మిత్రోం' లేకపోవడం నిరాశపరిచిందంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ట్విట్టర్‌లో ప్రస్తుతం 'మిత్రో' పదం ట్రెండ్ అవుతోంది.
''మిత్రోం' నుంచి ఉర్దూ పదం 'దోస్తోం'కి మోదీ మారిపోయారు. క్రైస్తవుల నూతన సంవత్సర పండుగకి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు అనుకూల పథకాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఉదారవాద సెక్యూలర్ నాయకుడిగా మారిపోయారు' అంటూ మాధవన్ నారాయణ్ ట్వీట్ చేయగా.. మోదీ మొదట మన నోట్లను దూరం చేశారు. ఇప్పుడు మనకు ఇష్టమైన 'మిత్రోం'ని కూడా దూరం చేస్తున్నారంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఈరోజు ప్రసంగంలో మోదీ 'మిత్రోం' అనలేదు. కొంపదీసి ఆయన మనల్ని అన్‌ఫ్రెండ్ చేయలేదు కదా అని మరొకరు చమత్కరించారు. డిమానిటైజేషన్ నుంచి డిమిత్రోనైజేషన్ జరిగినట్టుందని మరొకరు ట్వీట్ చేశారు.