
మరిన్ని అంశాలు బయటకొస్తాయి: డి. శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్ని విషయాలను బయటపెట్టలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సందర్భాన్ని బట్టి వాటిని బయటపెడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్‌రెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, ఆనంద భాస్కర్, పార్టీ నేతలు రెడ్యానాయక్, మల్లు రవి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొనగా... సీమాంధ్ర మంత్రులెవరూ హాజరుకాలేదు. జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి డీఎస్ ప్రసంగించారు.
రాష్ట్ర విభజన అంశంలో సోనియాగాంధీ పక్షపాతంతో తెలంగాణ వారికి మాత్రమే మేలు చేసిందని ఎవరైనా అనుకుంటే పొరపాటని, దేశ ప్రజలందరూ ఆమెకు ఒక్కటేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్యరూపం దాల్చిన తరువాత సోనియా, కేంద్రం తీసుకునే చర్యలతో సీమాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. రాష్ట్రాన్ని విడదీయాలన్నది ఒక ప్రాంత ప్రజల అభిప్రాయం మాత్రమే కాదని, 1972లోనే అవతలి ప్రాంతంలోనూ బలమైన జైఆంధ్ర ఉద్యమం జరిగిందని డీఎస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గత యాభై ఏళ్లుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తిస్తూనే, సాధ్యమైనంత వరకు కలిపి ఉంచే ప్రయత్నం చేసింది తప్పితే.. విభజించే అవకాశం లేదని ఏనాడూ అనలేదని తెలిపారు. పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత సీఎం నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకూ అందరిపై ఉందని స్పష్టంచేశారు. ఎవరికైనా, ఏ పార్టీకైనా హైదరాబాద్‌లో ఫలానా వారు ఉండటానికి వీలులేదనే అధికారం ఉండదన్నారు.
అమరవీరులకు నివాళులు : తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కోఠిలో తెలంగాణ అమరవీరుల అశోక స్థూపం వద్ద నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణకు విమోచనం కలిగిందన్నారు. 2014లో తెలంగాణ విమోచనాన్ని తెలంగాణ రాష్ట్రంలో జరుపుకొంటామన్నారు. మంత్రులు గీతారెడ్డి, పొన్నాల కూడా మాట్లాడారు.
అనిశ్చితికి కారణం కాంగ్రెస్ : బాబు
హైదరాబాద్ విమోచనా దినోత్సవం సందర్భంగా, తెలుగుదే శం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వుంగళవారం హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జాతీయ పతాకాన్ని, టీడీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో నాలుగేళ్లుగా అనిశ్చితి ఉందని, విభజనపై కాంగ్రెస్ తాజా నిర్ణయంతో సీమాంధ్రలో కూడా అదే పరిస్థితి తలెత్తిందని ఇందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలన్నారు. హైదరాబాద్‌తోపాటుగా తెలంగాణ అభివృద్ధి టీడీపీ హయంలోనే జరిగిందని, ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని తాను ప్రకటించినా ఎవ్వరూ ముందుకు రాలేదని అన్నారు. కార్యక్రవుం అనంతరం టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే, పటేల్, పట్వారీ, పెత్తందారి వ్యవస్థలను మరోసారి చవిచూడాల్సి వస్తుందని, దొరలరాజ్యం తెచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు.
వచ్చే ఏడాది అధికారికంగా నిర్వహిస్తాం : కిషన్‌రెడ్డి
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వచ్చే ఏడాది తామే అధికారికంగా నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం అసెంబ్లీ సమీపంలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం వద్ద ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అలాగే, ముస్లిం మైనారిటీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు అని ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ 64వ జన్మదినోత్సవంలో కిషన్‌రెడ్డి అన్నారు. నరేంద్రమోడీ హయాంలో గుజరాత్ ముస్లింలు అభివృద్ధి చెందారని, సుమారు 30 శాతం మంది ముస్లింలు ఆయనను ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్ర మైనార్టీ మోర్చా ఇక్కడ ఏర్పాటుచేసిన సభలో మోర్చా అధ్యక్షుడు హనీఫ్ ఆలీతో కలిసి కిషన్‌రెడ్డి కేక్ కట్ చేశారు. మోడీ ప్రధాని కాబోతున్నారని, కాంగ్రెస్ ఇది జీర్ణించుకోలేకపోతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.