కనుమరుగవుతున్న కంపెనీలు!
అక్రమ లావాదేవీలతో స్టాక్ మార్కెట్లను ఒక ఊపుఊపి చివరకు బోర్డు తిప్పేసిన స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్ గుర్తున్నాడు కదా? ఇతడు సృష్టించిన బూమ్‌లో మార్కెట్ ఫేవరెట్లుగా ఒక వెలుగువెలిగిన పలు షేర్లు ప్రస్తుతం స్టాక్ ఎక్స్ఛేంజీలలో కనిపించకుండా పోవడం చెప్పుకోదగ్గ పరిణామం! ఈ జాబితాలో సిల్వర్‌లైన్ టెక్నాలజీస్, పరేఖ్ ప్లాటినం, ఎస్‌కేఎం ఎగ్ ప్రోడక్ట్స్, టెలిడేటా మెరైన్‌లను ప్రధానంగా ప్రస్తావించవచ్చు. కేతన్ స్కామ్ బయటపడ్డాక ఈ షేర్ల ధరలు పాతాళానికి పడిపోవడమేకాకుండా ఎక్స్ఛేంజీల కన్నెర్రకు కూడా లోనయ్యాయి. వెరసి నిబంధన లు పాటించకపోవడంతో నిషేధానికి(సస్పెన్షన్) గురయ్యాయి. ఈ బాటలో సస్పెండ్ అయిన కంపెనీల సంఖ్య ఇప్పటికే 1,200కు చేరగా, మరికొన్ని కంపెనీలు అదే బాటలో నడుస్తుండటం గమనార్హం! కాగా, ఈ 1,200 కంపెనీలను ఎక్స్ఛేంజీలు ట్రేడింగ్ నుంచి నిషేధించడంతో సుమారు రూ. 2,500 కోట్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయాయి.
పెరుగుతున్న జాబితా
గతేడాది నుంచి ఎక్స్ఛేంజీల సస్పెన్షన్‌కు గురవుతున్న కంపెనీల జాబితా పెరుగుతుండటం చెప్పుకోదగ్గ పరిణామం. ఇందుకు ఆర్థిక మందగమనం, డిమాండ్ పడిపోవడం, గరిష్ట వడ్డీ రేట్లు, పెట్టుబడుల ఆవిరి వంటి కారణాలను కంపెనీలు చూపినప్పటికీ యాజమాన్య లోపాలే అధికమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితంగా 2011లో నిషేధానికి లోనైన కంపెనీలతో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య రెట్టింపునకుపైగా పెరిగింది. ఇక ఈ ఏడాది కూడా ఈ ట్రెండ్ కొనసాగుతూ ఇప్పటివరకూ 48 కంపెనీలు ఎక్స్ఛేంజీల కన్నెర్రకు లోనయ్యాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల నిషేధం కారణంగా లిస్టింగ్‌ను కోల్పోయిన కంపెనీలు సుమారు 1,200 వరకూ ఉన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ రోజువారీ ట్రేడింగ్‌లో అత్యధికంగా ట్రేడయ్యే షేర్ల సంఖ్యలో ఇవి సగం కావడం విశేషం! ఎక్స్ఛేంజీలలో చివరిసారిగా ట్రేడైన ధరల ప్రకారం చూసినా ఈ కంపెనీలలో రూ. 2,500 కోట్లమేర ఇన్వెస్టర్ల పెట్టుబడులు చిక్కుకుపోయాయి. ఈ పెట్టుబడులు తక్కువగానే కనిపించినప్పటికీ వీటిలో అత్యధిక శాతం కంపెనీలు నష్టాలను నమోదు చేయడంతో వీటి విలువ కనీస స్థాయికి చేరిందన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
సస్పెన్షన్ ఎందుకు?
సాధారణ పరిస్థితుల్లో కంపెనీలు లిస్టింగ్ నిబంధనలను అమలు చేయకపోతే స్టాక్ ఎక్స్ఛేంజీలు సస్పెన్షన్‌ను అమలు చేస్తాయి. వీటిలో ఆర్థిక ఫలితాల దాఖలు, వాటాదారుల వివరాలు, కార్పొరేట్ పరిపాలన(గవర్నెన్స్) వంటి అంశాలలో వరుసగా రెండు క్వార్టర్లపాటు కంపెనీలు విఫలంకావడం వంటివి ఉంటాయి. ఇవికాకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం అవకతవకలకు పాల్పడిన ట్లు గుర్తిస్తే ట్రేడింగ్ నుంచి కంపెనీలను నిషేధిస్తుంది.
ఇలా నిషేధానికి గురైన సంస్థలలో వత్సా మ్యూజిక్, వత్సా కార్పొరేషన్ తదితరాలున్నాయి. ఈ ఇష్యూలలో రూ. 11,000 కోట్లమేర ఇన్వెస్టర్ల నిధులు చిక్కుకుపోయాయి. ఇక ఐపీవోకు సంబంధించి పిరమిడ్ సాయిమీరాను, షేరు ధర రిగ్గింగ్‌కు పాల్పడిందన్న కారణంతో డీఎస్‌క్యూ బయోటెక్‌ను సెబీ నిషేధించింది. నిజానికి లిస్టింగ్ నిబంధనలను పాటించలేని కంపెనీలను నిషేధించడమే సరైన ప్రక్రియఅని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. తద్వారా ఇన్వెస్టర్లు కొంతలోకొంత తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు అవకాశం చిక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే ఇన్వెస్టర్లు తాము ఎంచుకున్న కంపెనీ నిర్వహిస్తున్న బిజినెస్‌తోపాటు, యాజమాన్య పటిష్టత, ఉత్పత్తుల నాణ్యత వంటి అంశాలను కూడా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.