
చైనా కుటిలనీతి
చైనా ఇటీవల కొత్త పేర్లు పెట్టిన అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల్లో చాలా మటుకు టిబెట్ లేదా దలైలామాతో సంబంధమున్నవేనని..
దలైలామాతో సంబంధమున్నప్రాంతాలకే పేరు మార్పు
న్యూఢిల్లీ: చైనా ఇటీవల కొత్త పేర్లు పెట్టిన అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల్లో చాలా మటుకు టిబెట్ లేదా టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాతో సంబంధమున్నవేనని చైనా నిపుణుడు పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో దలైలామా పర్యటనకు అనుమతించిన భారత్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడానికే చైనా ఇలా చేసిందని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చైనీస్ స్టడీస్ ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి చెప్పారు.
ఎగువ సుబానిస్రి జిల్లాలో మిలారిగా మారిన దాపోరిజో పట్టణం బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన సుబానిస్రి సమీపంలో ఉంది. భారత్‌లోకి ప్రవేశించడానికి టెబెటన్లు ఇదే ప్రాంతాన్ని ఉపయోగించుకునేవారని, చాలా ఏళ్ల పాటు ఇరు దేశాలు అక్కడ సైన్యాన్ని మోహరించలేదని శ్రీకాంత్ తెలిపారు. చైనా అధీనంలో ఉన్న అక్సాయ్ చిన్, మానస సరోవర ప్రాంతాల పేర్లు మార్చి భారత్ ఆ దేశానికి తగిన జవాబు చెప్పొచ్చని సూచించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు పట్టణాలకు ఇటీవల అధికారికంగా తమ పేర్లు పెట్టి భారత్ తో కయ్యానికి చైనా కాలు దువ్వింది.